Nagar Kurnool: దైవదర్శనానికి వచ్చిన మహిళపై సామూహిక అత్యాచారం
దైవదర్శనానికి వచ్చిన మహిళపై సామూహిక అత్యాచారం
Nagar Kurnool : నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఊరుకొండ ఆంజనేయ స్వామి దేవాలయానికి దైవదర్శనానికి వచ్చిన ఓ మహిళపై… ఎనిమిది మంది కామాంధులు అత్యాచారాని(Gang Rape)కి ఒడిగట్టారు. ఆమె ఎంత ప్రతిఘటించినప్పటికీ… వారు వదిలిపెట్టలేదు. అత్యాచారం అనంతరం ఆమెను అక్కడే పొదల్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దీనితో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Nagar Kurnool-Gang Rape
నాగర్ కర్నూల్(Nagar Kurnool) జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండ పేట ఆంజనేయ స్వామి దర్శనానికి శనివారం ఓ మహిళ తన కుటుంబంతో సహా వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ఇంతలోనే ఆ మహిళ బహిర్భూమికి వెళ్లాల్సి వచ్చింది. దీనితో బంధువును వెంట పెట్టుకుని మహిళ బహిర్భూమికి వెళ్లింది. కానీ ఆ కుటుంబం… దర్శనానికి ఆలయానికి వచ్చినప్పటి నుంచి ఆ ఊరిలోని కొందరు వ్యక్తులు మహిళపై కన్నేశారు. ఆమెను వెంబడించి… అవకాశం కోసం ఎదురు చూశారు. మహిళ బహిర్భూమికి వెళ్తున్న విషయాన్ని గమనించిన సదరు వ్యక్తులు… ఆమె వెంటే వెళ్లారు. ఆపై మహిళతో పాటు వచ్చిన బంధువుపై దాడి చేసి… మహిళను పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై ఎనిమిది మంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ మహిళ ఎంత ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అత్యాచారం అనంతరం ఆ కామాంధులు అక్కడి నుంచి పరారయ్యారు. జరిగిన ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఆరుగురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో ఇద్దరు యువకులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ విచారణ కొనసాగుతోందని… వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. అలాగే బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దైవదర్శనానికి వస్తే ఇంత దారుణానికి ఒడిగడతారా అంటూ బాధితురాలి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళపై అత్యాచార ఘటన గ్రామంలో సంచలనంగా మారింది.
Also Read : Betting Apps: బెట్టింగ్ యాప్స్ పై దర్యాప్తు ముమ్మరం చేయడానికి ఐదుగురితో సిట్ ఏర్పాటు