Nalin Prabhat: జమ్ముకశ్మీర్‌ డీజీపీగా ఏపీ కేడర్‌ ఐపీఎస్‌ నలిన్‌ ప్రభాత్‌ !

జమ్ముకశ్మీర్‌ డీజీపీగా ఏపీ కేడర్‌ ఐపీఎస్‌ నలిన్‌ ప్రభాత్‌ !

Nalin Prabhat: జమ్ముకశ్మీర్‌కు కొత్త డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ గా(డీజీపీ) సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి నళిన్‌ ప్రభాత్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కేబినెట్‌ నియామకాల కమిటీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌ డీజీపీగా ఆర్‌ఆర్‌ స్మైన్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన పదవీకాలం సెప్టెంబర్‌ 30 ముగియనుంది. కాగా స్మైన్‌ 1991 బ్యాచ్‌ కు చెందిన జమ్మూకశ్మీర్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి. 11 నెలలపాటు డీజీపీగా సేవలు అందించారు. ఈ తర్వాత పదవీ విరమణ చేయనున్నారు.

Nalin Prabhat As a New DGP

ఇక ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి నళిన్‌ ప్రభాత్‌(Nalin Prabhat). అయితే ఆంధ్రప్రదేశ్ కేడర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం, కేంద్ర పాలిత ప్రాంతం (AGMUT) కేడర్‌కు అతని డిప్యుటేషన్‌ను కేంద్రం ఆమోదించింది. ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(NSG)కి అధిపతిగా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 30 వరకు జమ్మూ కాశ్మీర్‌ లో స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఎస్‌డీజీ)గా నియమితులయ్యారు. అక్టోబర్ 1న డీజీపీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఆర్టికల్ 370 రద్దు అనంతరం సెప్టెంబర్ 30వ తేదీలోపు జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. మరో వారం, పది రోజుల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగనుంది. దీనితో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పునరుద్దరించడం, అసెంబ్లీ ఎన్నికలు సైతం ప్రశాంతంగా నిర్వహించేందుకు నళిన్ ప్రభాత్‌ను జమ్మూ కశ్మీర్‌కు కేంద్రం పంపిందనే ఓ చర్చ సైతం కొనసాగుతుంది.

1968లో హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో జన్మించిన నళిన్ ప్రభాత్(Nalin Prabhat).. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ ఎంఏ చేశారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఎన్నికైన ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పనిచేశారు. కరీంనగర్, కడప, వరంగల్ జిల్లాల ఎస్పీగా పనిచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీగా నళిన్ ప్రభాత్ పనిచేసిన సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. వాటిని ఎదుర్కోవడంలో ఆయన చూపిన తెగువ, చొరవకు ప్రశంసలతో పాటుగా అవార్డులు, రివార్డులు కూడా దక్కాయి. మూడు పోలీసు గ్యాలెంట్రీ మెడల్స్‌తో సహా అనేక గౌరవాలను అందుకున్నారు

గ్యాలంట్రీ మెడల్స్, పరాక్రమ్ పతక్(విశిష్ట సేవా పతకం), ఆంత్రిక్ సురక్ష పతకం సహా అనేక మెడల్స్ అందుకున్నారు. 2004 నుంచి కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతూ వచ్చారు. మొదట కొన్నాళ్లు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(NDRF)లో పనిచేసిన ఆయన, ఆ తర్వాత ఇండో-టిబెటన్ పోలీస్ ఫోర్స్(ITBP) 14వ బెటాలియన్(శ్రీనగర్), 21వ బెటాలియన్(శ్రీనగర్), 16వ బెటాలియన్(లడఖ్)లకు కమాండెంట్‌ గా పనిచేశారు.

తర్వాత సీఆర్పీఎఫ్‌ లో సౌత్ కాశ్మీర్ ఆపరేషన్ రేంజ్ డీఐజీగా మూడేళ్లపాటు పనిచేసిన ఆయన, కొన్నాళ్లు చండీగఢ్ రేంజ్, బస్తర్ ఆపరేషన్స్ రేంజ్‌లలో డీఐజీగా పనిచేశారు. 2010 డిసెంబర్ నుంచి రెండేళ్ల పాటు సీఆర్పీఎఫ్‌లో ఆపరేషన్స్, ఇంటెలిజెన్స్, ట్రైనింగ్, జమ్ము-కాశ్మీర్ జోన్, శ్రీనగర్ సెక్టార్లలో సేవలందించారు. ఐజీగా పదోన్నతి పొందిన తర్వాత కూడా కాశ్మీర్ ఆపరేషన్స్ సెక్టార్‌కు నేతృత్వం వహించారు.

ఇలా సుదీర్ఘకాలం జమ్ము-కాశ్మీర్ రాష్ట్రంలో వివిధ కేంద్ర పారామిలటరీ బలగాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయనకు ఈ ప్రాంతంపై సమగ్ర అవగాహన, పట్టు ఉంది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో ఇదే ప్రాంతంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం కూడా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఏరికోరి జమ్ము-కాశ్మీర్ డీజీపీగా నియమించినట్లుగా తెలుస్తోంది.

Also Read : Varalaxmi Vratham : తెలుగింట ప్రత్యేక పండుగగా చూసే ‘వరలక్ష్మీ వ్రతం’ శుభాకాంక్షలు

Leave A Reply

Your Email Id will not be published!