Nara Lokesh: ఇచ్ఛాపురం నుండి ప్రారంభమైన నారా లోకేష్ ‘శంఖారావం’ యాత్ర !
ఇచ్ఛాపురం నుండి ప్రారంభమైన నారా లోకేష్ ‘శంఖారావం’ యాత్ర !
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుండి ఆదివారం ‘శంఖారావం’ యాత్రను ప్రారంభించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉత్తరాంధ్రా జిల్లాకు చెందిన కీలక నాయకులు ఈ శంఖారావం యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం, పలాస, టెక్కలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో నారా లోకేష్ తనదైన శైలిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ… కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపారు. ఇచ్ఛాపురంలో దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం ఈ శంఖారావం యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇఛ్చాపురం రాజా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
Nara Lokesh Viral
ఈ బహిరంగ సభలో టీడీపీ(TDP) అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశ్యించి నారా లోకేష్(Nara Lokesh) మాట్లాడుతూ… ‘ఉత్తరాంధ్ర అమ్మలాంటిది… అమ్మప్రేమకు కండీషన్స్ ఉండవు. ఉత్తరాంధ్రులు ప్రేమాభిమానాలకు కూడా కండీషన్స్ లేవు. పోరాటాలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లా. అటువంటి శ్రీకాకుళం జిల్లాతో ఈ వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ కు పట్టిన ఓ క్యాన్సర్ గడ్డ… ఆ గడ్డను తొలగించడానికి అందరూ కలిసి పనిచేయాలని అని పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలోనికి వచ్చిన తరువాత ఇసుక, భూములు, మద్యం, మట్టి, మైనింగ్ ఇలా సహాజ వనరులను దోపిడీచేస్తూ రాష్ట్రాన్ని లూటీ చేసారన్నారు.
విశాఖను కార్యనిర్వాహక రాజధానిని చేస్తానంటూ భూములను కబ్జా చేసి, ఐటి కంపెనీలను వెల్లగొట్టి… చివరకు గంజాయి కేంద్రంగా మార్చారని ద్వజమెత్తారు. ఊరికో ప్యాలెస్ కట్టుకున్న సీఎం జగన్ ఉత్తరాంధ్రకు ఏం చేశారని లోకేష్ ప్రశ్నించారు. జగన్ ను చూస్తే జాలేస్తోందని… పద్దాక సిద్ధం అంటున్నారు. దేనికి సిద్ధం… నువ్వు జైలుకు వెళ్లడానికి సిద్ధమా ? మేము అందరం కలిసి నిన్ను జైలుకు పంపడానికి మాత్రం సిద్ధం అంటూ తనదైన శైలిలో సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.
జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎన్నికలు వస్తున్నాయని 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్తున్నారు. దీనిని నిరుద్యోగ యువత గ్రహిస్తున్నారన్నారు. టీడీపీ(TDP) వచ్చాక యేటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. జగన్ పదేపదే తాను పేదవాడు చెప్పుకుంటున్నారు… వినడానికి ఎంతో వితంగా ఉంది. జగన్ కు ఉన్నది లేనట్లు… లేనది ఉన్నట్లు చెప్పే మైతోమేనియా సిండ్రోమ్ అనే జబ్బు ఉందన్నారు. సాక్షి టీవీ, సిమెంట్ కంపెనీ, పవర్ కంపెనీ, లక్ష రూపాయల చెప్పులు వేసుకుని తిరిగే వీళ్లు పేదలు అవుతారా ? వెయ్యి రూపాయల ఖరీదైన బాటిల్ నీళ్లు తాగేవారు పేదవాడు అవుతాడా ?
షర్మిళను చూస్తే బాధేస్తోంది. 2019కి ముందు అన్న విడిచిన బాణం అన్నారు. కానీ ఇప్పుడు తల్లిని, చెల్లిని జగన్ గెంటేశారు. తనకు ప్రాణభయం ఉందని వివేకా కుమార్తె సునీతారెడ్డి భయపడుతోంది. వీరికే ఇలా ఉంటే మహిళలకు రాష్ట్రంలో ఏ విధంగా రక్షణ ఉంటుంది.? జగన్ కట్టింగ్.. ఫిట్టింగ్ మాస్టారు. బులుగు బటన్ నొక్కి రూ.10 వేస్తాడు… ఎర్ర బటన్ నొక్కి రూ.100 లాగేస్తాడు. 9 సార్లు విద్యుత్, 3 సార్లు బస్సు ఛార్జీలు పెంచాడన్నారు.
ఏపీ టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడతూ… తెలుగుదేశం పార్టీకి(TDP) రాబోయే ఏళ్లు నాయకత్వం వహించగల దమ్మున్న నేత నారా లోకేష్ అన్నారు. ఒక్క ఫోన్ కాల్ తో వేలమంది కార్యకర్తలు శంఖారావంలో పాల్గొనేందుకు తరలివచ్చారు. నా చివరి శ్వాస వరకు టెక్కలి ప్రజలకు, ప్రజాసేవకే అంకితమవుతా. అన్న ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన టెక్కలికి నేను ఎమ్మెల్యే కావడం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడ్ని కావడం నా అదృష్టం. మీ అందరి సహకారంతో 5సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా. అధికారమంటే ప్రజలకు సేవచేయడం, కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవడం అని భావించాను. చీమకు కూడా హాని తలపెట్టకుండా సేవలందించాను. ఎంతోమంది ముఖ్యమంత్రులను, మంత్రులను చూశాను, 2019లో ఎపి ప్రజలు దగా పడ్డారు. ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలు సృష్టించినా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రను ఆపకుండా కొనసాగించారని చెప్పారు. కార్యకర్తలకు ఎలా న్యాయం చేయాలనేది ఆయనకు తెలుసన్నారు. ఢిల్లీలో మన గళం వినిపించాలంటే లోక్సభ స్థానాల్లోనూ తెదేపాను గెలిపించాలని కోరారు.
యువగళం పేరుతో చిత్తూరు జిల్లా కుప్పం నుండి విశాఖ జిల్లా అగనంపూడి వరకు సుమారు 3,200 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించిన నారా లోకేష్… వివిధ కారణాల వలన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో యువగళం పాదయాత్రను కొనసాగించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల్లో శంఖారావం పేరిట ప్రత్యేకంగా యాత్ర నిర్వహిస్తున్నారు.
Also Read : FASTag Toll Updates : కేంద్ర సర్కార్ నుంచి ఫాస్టాగ్ వినియోగదారులకు శుభవార్త