Nara Lokesh: బడికెళ్లే పిల్లలందరికీ ‘తల్లికి వందనం’ – మంత్రి నారా లోకేశ్

బడికెళ్లే పిల్లలందరికీ ‘తల్లికి వందనం’ - మంత్రి నారా లోకేశ్

Nara Lokesh: కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత వివాదాలకు కేంద్ర బింధువుగా మారి తల్లికి వందనం పథకంపై మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) స్పష్టత ఇచ్చారు. కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చుతామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి ఎన్డీయే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని… శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Nara Lokesh Comment

‘పథకం అమలుకు విధివిధానాలను ఖరారు చేయడానికి కొంత సమయం పడుతుంది. గత ప్రభుత్వం అర్హుల సంఖ్యను తగ్గించేందుకు.. కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. అది కూడా రూ.15 వేలు కాకుండా.. రూ.13 వేలే ఇచ్చింది. ఇలాంటి లోపాలు లేకుండా పథకాన్ని అమలు చేయడానికి మంత్రులు, నిపుణులతో చర్చిస్తాం’ అని పేర్కొన్నారు. కుటుంబ విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు దాటిందని, ఆధార్‌ కార్డు చిరునామాలో మార్పు ఉందని ఇలా రకరకాల కొర్రీలతో గత ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను తగ్గించిందని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ లక్ష్మణరావు చెప్పారు. ఈ పథకంతో ప్రభుత్వ పాఠశాలల ఉనికి ప్రమాదంలో పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు సూచించారు.

‘రాష్ట్రంలోని 11 వేల పాఠశాలల్లో 10 మంది కంటే తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. 2019తో పోలిస్తే 2024 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య సుమారు 72 వేలు తగ్గింది. వీటికి కారణాలేంటి? విద్యార్థుల సంఖ్యను ఎలా పెంచాలి? నాణ్యమైన విద్య ఎలా అందించాలని యోచిస్తున్నాం. పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న అత్యున్నత విధానాలను పరిశీలిస్తున్నాం. ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీల్లో అధ్యయనానికి అధికారుల బృందాన్ని పంపాం. త్వరలో నేను కూడా వెళ్లి పరిశీలించిన తర్వాత.. మన రాష్ట్రానికి సరిపడా నమూనా ఎలా ఉండాలనేది రూపొందిస్తాం. దీనిపై అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తాం’ అని లోకేశ్‌ చెప్పారు.

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోఫెల్‌పై సమీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేశ్‌(Nara Lokesh) చెప్పారు. ‘టోఫెల్‌లో ఉచ్చారణ అంతా అమెరికన్‌ యాక్సెంట్‌లో ఉంటుంది. అది 3 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు అర్థం కావట్లేదు. ఉపాధ్యాయులకు శిక్షణ లేకపోవడం వల్ల పిల్లలకు నేర్పించలేకపోతున్నారు. ప్రపంచంతో పోటీ పడాలంటే ఆంగ్ల మాధ్యమంలో విద్య అవసరం. కానీ మాతృభాషను కాపాడుకోవాలి. మాతృ భాష మాట్లాడటంలో విద్యార్థులు ఇబ్బంది పడకూడదు. నేను కూడా మాతృభాషలో మాట్లాడేందుకు తడబడుతుంటా. నేనూ ఇంజినీరింగ్‌ కు వెళ్లే ముందు టోఫెల్‌ శిక్షణ తీసుకున్నా. ఉత్తరప్రదేశ్‌లో విద్యార్థులకు కమ్యూనికేషన్‌ ఇంగ్లిష్‌ బోధించే విధానం పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దాన్ని పరిశీలిస్తున్నాం’ అని మంత్రి వివరించారు.

Also Read : Amaravathi Railway Line: రూ.2,047 కోట్లతో ఏపీ రాజధాని అమరావతికి రైల్వే లైన్ !

Leave A Reply

Your Email Id will not be published!