భేషజాలు పక్కన పెట్టండి కలిసికట్టుగా పని చేయండి
పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి నారా లోకేష్
గుంటూరు జిల్లా : రాష్ట్ర విద్యా, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో కలిసి విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ శిక్షణా తరగతులకు ఇటీవల నియమించిన 25 పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు కమిటీ సభ్యులందరూ హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు నారా లోకేష్ బాబు. భారత దేశంలో మన పార్టీకి ఉన్నంత కేడర్, కమిట్మెంట్ ఏ పార్టీకి లేదన్నారు . దీనిని స్పూర్తిగా తీసుకుని మరింత ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
పార్టీ అంటే కమిట్ మెంట్ ఉన్నవారు కనుకనే ఈ రోజు పార్టీ కమిటీల్లో బాధ్యత కల్పించామన్నారు నారా లోకేష్. భేషజాలు పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏ ఒక్కరూ నిర్లక్ష్యం వహించేందుకు వీలు లేదన్నారు. మీరు లేక పోతే పార్టీయే లేదన్నారు నారా లోకేష్. అందుకే దేశంలో ఏ పార్టీలో లేని విధంగా తాము కార్యకర్తలను దేవుళ్ల కంటే ఎక్కువగా చూసుకుంటున్నామని చెప్పారు. ప్రమాద, లేదా మరణించినా వారి కుటుంబాలను ఆదుకుంటున్నామని తెలిపారు. అంతే కాకుండా పార్టీ పరంగా భరోసా కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరికి బీమా సదుపాయం కల్పించామన్నారు. కష్ట పడి పని చేసిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు.
