Nara Lokesh: పరకామణిలో వైసీపీ నాయకులు రూ.100 కోట్లు కొల్లగొట్టారు – మంత్రి లోకేశ్‌

పరకామణిలో వైసీపీ నాయకులు రూ.100 కోట్లు కొల్లగొట్టారు - మంత్రి లోకేశ్‌

Nara Lokesh : గత వైసీపీ ప్రభుత్వం, నాయకులపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సంచలన వ్యాఖ్యలు చేసారు. తిరుమల పరకామణిలో వంద కోట్ల రూపాయల శ్రీవారి సొత్తును వైసీపీ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు వందకోట్ల పరకా‘మనీ’ దొంగ వెనుక ఆ పార్టీ నేతలు ఉన్నారంటూ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) ఓ వీడియోను తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేశారు.

Minister Nara Lokesh Comments

‘‘జగన్‌ ఐదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలింది. అరాచకం పెచ్చరిల్లింది. దొంగలు, దోపిడీదారులు, మాఫియా డాన్లకు ఏపీని కేరాఫ్ అడ్రస్‌ మార్చారు. గనులు, భూములు, అడవులు, సమస్త వనరులతోపాటు జనాన్ని దోచుకున్న జగన్ (YS Jagan) గ్యాంగ్… చివరకు తిరుమల శ్రీవారి సొత్తునూ వదల్లేదు. తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు, నాటి టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతో తిరుమల పరకామణిలో దొంగలు పడ్డారు. రూ.కోట్ల విలువైన సొత్తు కొల్లగొట్టారు. ఆ డబ్బులు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారు. తిరుపతిలో భూమన నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు వాటాలు అందాయని నిందితులే చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో నమ్మకంతో కట్టిన ముడుపులు, హుండీలో వేసిన కానుకలు రూ.వందల కోట్లు రవికుమార్ దోచుకుని వెళ్లినప్పుడు తితిదే చైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి.. అతడి మనుషులు ఏకంగా ఈ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేయడానికి యత్నించారు.

అధికార అండతో జగన్ (YS Jagan) గ్యాంగ్ శ్రీవారికి చేయని అపచారం లేదు. భక్తులు మహా ప్రసాదంగా భావించే లడ్డూను కల్తీ చేశారు. అన్న ప్రసాదాన్ని భ్రష్టు పట్టించారు. తిరుమల దర్శనాలను అమ్మేసి సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం దుర్లభం చేశారు. ఏడుకొండల జోలికి వెళ్లొద్దు, శ్రీవారికి అపచారం తలపెట్టవద్దని.. నాడు చంద్రబాబు (CM Chandrababu) బతిమాలి చెప్పినా జగన్‌ వినలేదు. ఏడుకొండలవాడు చాలా పవర్ ఫుల్ సామీ. ఆయనకు అపచారం తలపెట్టినా, ఆయన సన్నిధిలో అవినీతికి పాల్పడినా.. ఏం జరుగుతుందో తెలిసికూడా జగన్, భూమన ఏకంగా పరకామణినే దోచేశారు. గుడిలో హుండీని దోచేసిన పాపాలతో జగన్ గ్యాంగ్ పాపం పండింది. పరకామణి వీడియోలు ఈరోజు బయటపడ్డాయి. రేపు నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారు’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

పరకామణిలో రూ.100 కోట్ల దొంగతనం – భానుప్రకాష్ రెడ్డి

వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భారీగా దోచుకున్నారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. స్వామి వారి హుండీని వైసీపీలోని కీలక నేతలు దోచుకున్నారని విమర్శించారు. గతంలో టీటీడీ నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కు కూడా ఇందులో వాటాలు వెళ్లాయని ఆరోపించారు. శనివారం తిరుపతి వేదికగా భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో పవిత్రమైన శ్రీవారి హుండీ నుంచి విదేశీ డాలర్లను దొంగతనం చేసిన కేసును తిరిగి విచారణ చేసేందుకు ఏపీ హై కోర్టు సంచలన ఉత్తర్వులు ఇచ్చిందని భానుప్రకాష్ రెడ్డి గుర్తుచేశారు.

లోక్ అదాలత్‌ లో రాజీ అయితే ఏపీ హైకోర్టు ఉత్తర్వులతోనే మళ్లీ విచారణ సాధ్యమని చెప్పుకొచ్చారు. శ్రీవారి పరకామణిలో జరిగిన దొంగతనం కేసును సీబీసీఐడీ విచారణ చేసి అక్టోబర్ 13వ తేదీలోపు సీల్డ్ కవర్‌ లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. గత జగన్ ప్రభుత్వంలో టీటీడీలో ఉన్నతాధికారులుగా పని చేసిన వారికి కూడా ఇందులో వాటాలు ఉన్నాయని విమర్శించారు. సీబీసీఐడీ సీల్డ్ కవర్ నివేదిక హై కోర్టుకు అందిన వెంటనే కీలకమైన వ్యక్తులు జైలుకెళ్లడం ఖాయమని హెచ్చరించారు. శ్రీ కృష్ణ దేవరాయుల కాలంలో ఇలా దొంగలిస్తే ఉరిశిక్ష విధించారని గుర్తుచేశారు. గత జగన్ ప్రభుత్వంలో టీటీడీలో రోజుకూ రూ.10 నుంచి రూ.12 లక్షల వరకు కొట్టేసేవారని… అలా ఎన్నో సంవత్సరాలు దోచుకున్నారని ఆరోపించారు. లెక్కలేనన్ని ఆస్తులు కొన్నారని… చెన్నై సమాచార కేంద్రంలో ఆస్తులను రాయించుకున్నారని భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు.

లోక్ అదాలత్‌ లో ఈ కేసును రాజీ చేయించేశారని చెప్పుకొచ్చారు. పోలీసు శాఖ నుంచి తీవ్రమైన వత్తిడి వల్ల లోక్ అదాలత్‌లో రాజీ చేసుకుంటున్నట్లు విజిలెన్స్ నివేదికలో పేర్కొందని గుర్తుచేశారు. ఈ సంఘటన జరిగినప్పుడు కరుణాకర్ రెడ్డి చైర్మన్‌గా ఉన్నారని తెలిపారు. గోవిందదాసుగా చెప్పుకున్న కరుణాకర్ రెడ్డి అప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అప్పట్లో ఈ కేసు విచారణ చేసిన వ్యక్తి అప్రూవర్‌గా మారారని తెలిపారు. ఆయన సంచలన నిజాలను వెలుగులోకి తీసుకురాబోతున్నారని చెప్పుకొచ్చారు. గతంలో సీసీ టీవీ ఫుటేజ్ మొత్తాన్ని డిలీట్ చేసేశారని ఆరోపించారు. పరకామణిలోనే కాదని… తులాభారంలో కూడా గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు చేతివాటం ప్రదర్శించారని విమర్శించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు పూర్తి అయిపోగానే గత పాలకులకు సహకరించిన వారిని టీటీడీ నుంచి పంపేస్తున్నామని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read : Revanth Reddy: కవిత వ్యవహారం పూర్తిగా ఆస్తి పంపకాల వివాదమే – సీఎం రేవంత్‌

Leave A Reply

Your Email Id will not be published!