New Airports: ఏపీకు రెండు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు
ఏపీకు రెండు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు
New Airports : ఏపీలో రెండు గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి(New Airports) ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. వాటిలో ఒకటి రాజధాని అమరావతిలో… మరొకటి శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం పావులు కదుపుతుంది. కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మెహన్ నాయుడు(Ram Mohan Naidu) స్వంత జిల్లా అయిన శ్రీకాకుళం అయితే అన్నింటికి అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు పనులు శరవేగంగా జరుగుతుండటంతో దానికి దగ్గరలోనే అంటే ఉద్ధానం ప్రాంతంలోనే ఈ గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
New Airports in Andhrapradesh
ఈ నేపథ్యంలో ఈ రెండు విమానాశ్రయాలకు సంబంధించి ప్రీ-ఫీజిబిలిటీని పరిశీలించేందుకు… సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక (టీఈఎఫ్ఆర్) రూపొందించేందుకు కన్సల్టెంట్ల నియామకానికి ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీ) టెండర్లు పిలిచింది. ఆన్లైన్లో టెండర్ల దాఖలుకు ఈ నెల 21 వరకు గడువు ఇచ్చింది. ఈ నెల 24న సాంకేతిక బిడ్లు, 27న ఫైనాన్షియల్ బిడ్లు తెరవనుంది. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు ఏ ప్రాంతం అనుకూలమో కూడా కన్సల్టెన్సీ సంస్థే సూచించాలని నిబంధనల్లో పేర్కొంది.
శ్రీకాకుళం జిల్లాలో విమానాశ్రయాన్ని ఈశాన్య దిశలో… శ్రీకాకుళం నగరానికి 70 కి.మీ. దూరంలో, సముద్ర తీరానికి సమీపంలో నిర్మించనున్నట్లు తెలిపింది. ప్రతిపాదిత విమానాశ్రయాల నిర్మాణం, నిర్వహణను ప్రభావితం చేసే సాంకేతిక, ఆర్థిక అంశాలను కన్సల్టెన్సీ సంస్థలు గుర్తించాలని పేర్కొంది. తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా విమానాశ్రయాల నిర్మాణానికి కాన్సెప్ట్ మాస్టర్‌ప్లాన్, ఫైనాన్షియల్ మోడల్, ప్రాజెక్ట్ స్ట్రక్చర్లను సిద్ధం చేయాలని.. పర్యావరణ, సామాజిక ప్రభావ అధ్యయనాలు నిర్వహించాలని సూచించింది. విమానాశ్రయం నిర్మాణానికి ఎంత ఖర్చవుతుంది, ఎన్ని దశల్లో చేపట్టాలి, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం, జాయింట్ వెంచర్ వంటి విధానాల్లో దేన్ని అనసరించాలి తదితర ప్రతిపాదనలతోపాటు ఎంత ఆదాయం వస్తుంది వంటి అంచనాల్ని సిద్ధం చేయాలని స్పష్టం చేసింది.
విమానాశ్రయాలున్న ప్రాంతాలను ఏవియేషన్ హబ్‌లుగా తీర్చిదిద్దేందుకు… వైమానిక, రక్షణరంగ తయారీ పరిశ్రమల అభివృద్ధికి ఉన్న అవకాశాలపై కూడా కన్సల్టెన్సీ సంస్థలు అధ్యయనం చేయాలని ఏపీఏడీసీ తెలిపింది. భవిష్యత్తులో డిమాండ్ ఎలా ఉండబోతోంది, ఎయిర్ ట్రాఫిక్ వృద్ధి ఎలా ఉంటుందన్న అంశాలనూ శోధించాలంది. ప్రభుత్వం నుంచి ఆర్థిక, ఇతరత్రా ఎలాంటి ప్రోత్సాహకాలు ఉండాలో కూడా సూచించాలని తెలిపింది. విమానాశ్రయాలకు ప్రాంతీయ అనుసంధానత, భవిష్యత్తులో ప్రయాణికులు అవరోధాలు లేకుండా సులభంగా ఎయిర్‌పోర్టులకు చేరుకునేందుకు అభివృద్ధి చేయాల్సిన రవాణా మార్గాలపైనా కన్సల్టెన్సీ సంస్థలు నివేదిక ఇవ్వాలని సూచించింది.
35 ఏళ్ల అవసరాలకు సరిపడా కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్
విమానాశ్రయాలకు సంబంధించి రాబోయే 35 ఏళ్ల ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాన్సెప్ట్ మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని, రన్ వేలు, ట్యాక్సీవేలు ఎన్ని ఉండాలి… అవి ఎంత పొడవు ఉండాలి… ఎయిర్‌క్రాఫ్ట్ పార్కింగ్ స్టాండ్లు ఎన్ని అవసరం… ఎలాంటి విమానాలు నిలిపేందుకు ఏ తరహా స్టాండ్లు ఉండాలి… ప్యాసింజర్, కార్గో టెర్మినళ్లు ఎలా ఉండాలి వంటి అంశాలన్నీ మాస్టర్‌ప్లాన్‌లో ఉండాలని తెలిపింది. విమానాశ్రయాలకు ఇతరత్రా మార్గాల్లో ఆదాయం (నాన్ ఏవియేషన్ రెవెన్యూ) వచ్చేందుకు అవసరమైన నిర్మాణాలు చేపట్టేందుకు ఎంత భూమి అవసరం? తదితర సమస్త సమాచారాన్నీ కన్సల్టెన్సీ సంస్థలు తమ నివేదికల్లో పొందుపరచాలని ఏపీఏడీసీ పేర్కొంది.