Nimisha Priya: కేరళ నర్సుకు యెమెన్‌లో మరణశిక్ష ! ‘బ్లడ్‌ మనీ’ని వాళ్లు అంగీకరిస్తారా?

కేరళ నర్సుకు యెమెన్‌లో మరణశిక్ష ! ‘బ్లడ్‌ మనీ’ని వాళ్లు అంగీకరిస్తారా?

Nimisha Priya : కేరళకు చెందిన నర్స్‌ నిమిష ప్రియకు యెమెన్‌లో పడిన మరణశిక్ష అమలుకు ఇంకా మరికొన్ని గంటల సమయమే ఉంది. ఆ శిక్షను ఆపేందుకు ఇప్పుడు భారత్‌ వద్ద పెద్దగా మార్గాలేమీ లేవని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక మిగిలింది బ్లడ్ మనీ ఆప్షనే… అయితే అది ప్రైవేటు సంప్రదింపు అని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది.

Nimisha Priya Sentenced Death

హూతీల పాలనలో ఉన్న యెమెన్‌ చట్టాల ప్రకారం… నేరం రుజువైన తర్వాత కూడా దోషిని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష తప్పుతుంది. అయితే బాధిత కుటుంబం బ్లడ్‌మనీకి అంగీకరిస్తేనే అది సాధ్యమవుతుంది. ఈ విషయంలో నిమిష (Nimisha Priya) కుటుంబం… బాధిత కుటుంబంతో సంప్రదింపులు కొనసాగిస్తోందని ‘ది సేవ్‌ నిమిషప్రియ ఆర్గనైజేషన్’ సుప్రీంకోర్టుకు వెల్లడించింది. చెప్పుకోదగ్గ స్థాయిలో ధనాన్ని సేకరించింది. అయితే ఈ విషయంపై చర్చించేందుకు ఆ కుటుంబం, హూతీ యంత్రాంగం నిరాకరిస్తోంది. ‘‘ఈ వ్యవహారం తమ గౌరవానికి సంబంధించినదిగా వారు చెప్తున్నారు. ఆ మొత్తం పెరిగితే… వారి అభిప్రాయం మారుతుందో లేదో తెలియదు. ఇప్పటికైతే ఆ చర్చలు నిలిచిపోయాయి’’ అని అటార్నీ జనరల్ ఆర్‌. వెంకటరమణి కోర్టులో వెల్లడించారు.

గత ఏడాది నిమిష (Nimisha Priya) తల్లి ప్రేమకుమారి యెమెన్ వెళ్లారు. తనకున్న పరిచయాల ఆధారంగా బ్లడ్‌మనీ ఇచ్చి, తన కుమార్తెను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రియ కుటుంబం మిలియన్‌ డాలర్లు (రూ.8.6 కోట్లు)ను బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమైంది. దీనిపై అటువైపు నుంచి స్పందన రాలేదని బాబుజాన్‌ అనే యాక్టివిస్ట్‌ ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించారు. కాగా.. ఆమెను కాపాడేందుకు భారత్‌ ప్రయత్నిస్తున్నప్పటికీ హూతీలతో అధికారిక దౌత్య సంబంధాలు లేని కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యెమెన్‌లోని చాలా ప్రాంతాలు ఈ గ్రూప్ నియంత్రణలో ఉన్నాయి. ‘‘ఉరిశిక్షను వాయిదా లేదా నిలిపివేయడం సాధ్యమేనా అని ప్రాసిక్యూటర్‌కు లేఖ రాశాము. యెమెన్‌ విషయంలోని సున్నితత్వాన్ని దృష్టిలోపెట్టుకొని.. ఈ విషయంలో ప్రభుత్వం చేయగలిగింది ఎక్కువగా ఏమీ లేదు’’ అని అటార్నీ జనరల్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జులై 18కి వాయిదా పడింది. ‘‘విదేశం విషయంలో ఆదేశాలు ఎలా జారీచేయగలం..?’’ అని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

Also Read : BIMSTEC-2025: బిమ్స్ టెక్ 2025 సదస్సు ప్రారంభించిన కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్

Leave A Reply

Your Email Id will not be published!