Nirmal SP: వృద్ధునిపై దురుసుగా ప్రవర్తించిన ఏఎస్సై పై సస్పెన్షన్ వేటు
వృద్ధునిపై దురుసుగా ప్రవర్తించిన ఏఎస్సై పై సస్పెన్షన్ వేటు
Nirmal SP : నిర్మల్ జిల్లా ఖానపూర్ మండలం పాత ఎల్లాపూర్ లో భూ సమస్య చెప్పుకోవడానికి అధికారుల వద్దకు వెళ్తున్న ఓ వృద్ధ రైతుపై ఏఎస్సై దురుసుగా బయటకు గెంటేసిన సంగతి తెలిసిందే. భూభారతి రెవెన్యూ సదస్సులలో భాగంగా పంచాయతీ కార్యాలయంలో చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో… అల్లెపు వెంకటి అనే వృద్ధ రైతును ఏఎస్సై రాంచందర్ దురుసుగా బయటకు లాక్కెళ్లారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనితో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనితో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మంత్రి సీతక్క(Minister Seethakka)… ఏఎస్సైపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిలను ఆదేశించారు. ఈ మేరకు రాంచందర్‌ను సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్పీ ప్రకటన విడుదల చేశారు.
వృద్ధ రైతుపై కర్కశత్వమా – మాజీ మంత్రి హరీశ్‌రావు
రెవెన్యూ సదస్సులో సమస్య చెప్పుకోవడానికి వచ్చిన వృద్ధ రైతును పోలీసు మెడ పట్టుకొని గెంటివేశారని, వృద్ధ రైతు పట్ల ఇంత కర్కశత్వమా ? అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్(Nirmal) జిల్లాలో జరిగిన ఘటనపై ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం బేషరతుగా యావత్ తెలంగాణ రైతు లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో 70 మంది ఫుడ్ పాయిజన్‌కు గురి కావడం, అందులో ఒకరు మృతి చెందటం అత్యంత బాధాకరమని మరో ప్రకటనలో హరీశ్‌రావు(Harish Rao) పేర్కొన్నారు.
Nirmal SP – ఎర్రగడ్డ ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్
ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో కలుషితాహారం తిని ఒకరు మృతి చెందడంతోపాటు 92 మంది అస్వస్థతకు గురైన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం ఉదయం ఆసుపత్రిని సందర్శించారు. సంఘటనకు గల కారణాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనితను అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన రోగులను పరామర్శించిన ఆయన, జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. కాగా, ఆసుపత్రికి కలుషిత ఆహార పదార్థాలను సరఫరా చేసిన డైట్ కాంట్రాక్టర్ జైపాల్‌రెడ్డిని తొలగించాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. అస్వస్థతకు గురైన వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
అధికారులు అస్వస్థతకు గురైన వారిలో 18 మందిని మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉస్మానియాలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఈ నెల రెండున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున అందించిన ఒక స్వీట్ వల్లే ఇది జరిగిందని వైద్య సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారని, ఇతర ఆహార పదార్థాలతోపాటు వాటి శాంపిల్స్ కూడా పరీక్షలకు పంపించామని మంత్రి తెలిపారు. పరీక్షల అనంతరం వచ్చిన నివేదిక ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, నిజనిర్ధారణకోసం డీఎంఈతో కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే బోరబండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు.
కలుషిత ఆహారం వల్లే ఘటన
రోగుల అస్వస్థతకు ప్రధాన కారణం కలుషిత ఆహారమేనని నిజనిర్ధారణ కమిటీ తేల్చింది. డీఎంఈ డాక్టర్ రాజేంద్రకుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనితలు విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ పద్మజను ఆ విధులనుంచి తప్పించి.. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. అలాగే ఆమె స్థానంలో ఉస్మానియా ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ బి.శంకర్ కు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించింది.
Also Read : Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి
