Nirmala Sitharaman: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూనే ఉంటాం – నిర్మలా సీతారామన్‌

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూనే ఉంటాం - నిర్మలా సీతారామన్‌

Nirmala Sitharaman :  రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లు చేస్తుందనే నెపంతో… ఇండియాపై అమెరికా అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ… భారత్‌ వెనక్కి తగ్గలేదు. రష్యాతో తన ఆర్ధిక సంబంధాలు కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో రష్యా నుండి చమురు కొనుగోళ్ళపై తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) స్పందించారు. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తూనే ఉంటుందని ఆమె మరోసారి స్పష్టం చేశారు. భారత తన సొంత ప్రయోజనాలకనుగుణంగా ఇంధన ఎంపికలు చేసుకుంటుందని వెల్లడించారు.

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… ‘‘రష్యా చమురు కొనుగోలు కొనసాగుతుంది. మన అవసరాలకు తగినది కొనడం.. చమురును ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలనే దానిపై నిర్ణయం మనమే తీసుకోవాలి’’ అని భారత వైఖరిని సీతారామన్‌ (Nirmala Sitharaman) స్పష్టం చేశారు. ఇక అమెరికా అదనపు సుంకాల నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎగుమతిదారుల అంశంపై కూడా ఆర్థిక మంత్రి స్పందించారు. ఎగుమతిదారుల కోసం ఉపశమన చర్యల ప్యాకేజీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. ఇటీవల విధించిన సుంకాలతో ప్రభావితమైన పరిశ్రమలను ఈ ప్యాకేజీ ఆదుకుంటుందని తెలిపారు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై ట్రంప్‌ అదనంగా 25 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో భారత ఉత్పత్తులపై సుంకాలు 50 శాతానికి పెరిగాయి.

Nirmala Sitharaman – బెంజ్‌కు.. హవాయి చెప్పులకు ఒకే జీఎస్టీ వేయలేం – నిర్మలా సీతారామన్‌

మన దేశ ఆర్థిక వ్యవస్థ వైవిధ్యభరితమైనదని, ఇలాంటి సమయంలో ఒకే పన్ను విధానాన్ని తీసుకురావడం అసాధ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) అభిప్రాయపడ్డారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) స్వరూపంలో కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణలపై ఆమె మాట్లాడారు. సామాన్యులపై పన్ను భారం తగ్గించేందుకే జీఎస్టీ (GST) విధానంలో ఈ సవరణలు చేసినట్లు తెలిపారు. జాతీయ మీడియా సంస్థ ‘ఇండియాటుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మలమ్మ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘వన్‌ నేషన్‌- వన్‌ ట్యాక్స్‌ మంచి ఆలోచనే కానీ… ఆచరణలో అది సాధ్యం కాదు. అభివృద్ధిలో వైవిధ్యాలు ఉన్నప్పుడు ఏకరూప జీఎస్టీ (GST) రేటును అమలు చేయడం అన్యాయమవుతుంది. మెర్సిడెస్‌ బెంజ్‌ కారు, హవాయి చెప్పులకు ఒకే పన్ను రేటు విధించగలమా? ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ వైవిధ్యభరితంగా ఉంది. అభివృద్ధి చెందిన రంగాలు అధిక పన్నులను కట్టగలుగుతాయి. అభివృద్ధి చెందని రంగాలకు అది భారమవుతుంది. ఒకవేళ భారత్‌ అన్ని రంగాల్లో సంపూర్ణంగా అభివృద్ధి చెందితే అప్పుడు ఒకే పన్ను విధానం సాధ్యమవుతుంది’’ అని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.
గబ్బర్‌ సింగ్ ట్యాక్స్ అన్నవారే..

ఈ సందర్భంగా విపక్ష కాంగ్రెస్‌ పార్టీపై ఆర్థిక మంత్రి విమర్శలు గుప్పించారు. ‘‘ఒకప్పుడు జీఎస్టీని గబ్బర్‌ సింగ్ ట్యాక్స్ అంటూ ఎగతాళి చేసిన వారే.. ఇప్పుడు పన్ను సంస్కరణలు చేయగానే క్రెడిట్‌ తీసుకునేందుకు ఆరాటపడుతున్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 91శాతం వరకు ఆదాయపు పన్ను విధించిన రోజులు ఉన్నాయి’’ అని దుయ్యబట్టారు. జీఎస్టీలో సంస్కరణ వల్ల రాష్ట్రాలతో పాటు కేంద్రానికి కూడా ఆదాయంలో కొంత కోత ఉంటుందని నిర్మలమ్మ తెలిపారు. తమ ప్రభుత్వానికి పౌరుల అవసరాలే ప్రథమ ప్రాధాన్యమని, ఆ తర్వాతే ఆదాయం గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు. టారిఫ్‌ల వల్ల ఎగుమతిదారులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారంపైనా కేంద్రం దృష్టిపెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతానికి పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదనేదీ లేదని మరోసారి స్పష్టం చేశారు.

Also Read : Sudershan Reddy: ఉపరాష్ట్రపతి కార్యాలయం రాజకీయ సంస్థ కాదు – జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!