Nitin Gadkari: హైదరాబాద్‌ లో పలు ఫ్లైఓవర్స్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

హైదరాబాద్‌ లో పలు ఫ్లైఓవర్స్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

 

హైదరాబాద్‌ మహానగరంలోని అంబర్‌పేట, బీహెచ్‌ఈఎల్‌ కూడలిలో నిర్మించిన ఫ్లై ఓవర్లను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభించారు. అంబర్‌పేట పైవంతెనను రూ.145 కోట్లతో, నాలుగు వరుసల్లో సుమారు 1.5 కి.మీ మేర నిర్మించగా… చందానగర్‌ నుంచి బీహెచ్‌ఈఎల్‌ మీదుగా రామచంద్రాపురం వరకు రూ.176 కోట్లతో 1.6కి.మీమేర బీహెచ్‌ఈఎల్‌ వంతెనను నిర్మించారు. అయితే అంబర్‌పేట పైవంతెన ప్రారంభోత్సవ సమయంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌, బీజేపీ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. బీజేపీ నాయకులు మోదీ..మోదీ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ నాయకులు పోటీగా నినాదాలు అందుకున్నారు. మరోవైపు మంత్రి గడ్కరీ కాన్వాయ్‌ ను కాంగ్రెస్‌ నేతలు అడ్డుకున్నారు. దీనితో ఆందోళనకు దిగిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు చెదరగొట్టారు. అనంతరం అంబర్‌ పేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో మరింత మేర జాతీయరహదారులను అభివృద్ధి చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

 

 

అంతకుముందు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించిన మంత్రి నితిన్ గడ్కరీ… ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఆదివాసీల జిల్లా ఇది అని కొనియాడారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ లో సభావేదికపై నుంచి జాతీయ రహదారులను ఆయన ప్రారంభించారు. రూ.3,900 కోట్ల విలువైన పనులను మొదలుపెట్టి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పీఎం సడక్‌ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తోందని చెప్పారు. రహదారులు మెరుగ్గా ఉండే దేశాన్నే అభివృద్ధి చెందిన దేశంగా భావిస్తారని పేర్కొన్నారు. వ్యవసాయం, ఉపాధి, రవాణా, మౌలిక వసతులు అనే 4 అంశాలు దేశాభివృద్ధిని నిర్దేశిస్తాయన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ… ‘‘రాష్ట్రాల మధ్య అనుసంధానం పెంచేందుకు కీలకమైన ప్రాజెక్టును కేంద్రం చేపట్టింది. రోడ్డు కనెక్టివిటీలో భాగంగా క్లిష్టమైన వంతెనలు, సొరంగ మార్గాలు నిర్మిస్తున్నాం. జోజిలా పాస్‌ టన్నెల్‌ వంటి నిర్మాణాలను చేపట్టాం. సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మించనున్నాం. నాగ్‌పుర్‌ నుంచి విజయవాడ కారిడార్‌ చేపట్టాం. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రోడ్డు కనెక్టివిటీ మరింత పెరగనుంది. భద్రాచలం, బాసర, మేడారం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తాం. జగిత్యాల-కరీంనగర్‌ హైవే విస్తరణ పనులను త్వరలోనే చేపడతాం. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య తగ్గించేందుకు ఎన్నో ప్రాజెక్టులు చేపట్టాం. అంబర్‌పేట్‌లో నిర్మించిన పైవంతెనను ఇవాళే ప్రారంభించుకోనున్నాం. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్‌, సీఎన్‌జీ వాహనాలను ప్రోత్సహిస్తున్నాం. పెట్రోల్‌ వాహనాలకు బదులుగా విద్యుత్‌ వాహనాలు ఇంకా పెరగాలి. వీటితో రవాణా ఖర్చు బాగా తగ్గుతుంది’’ అని గడ్కరీ తెలిపారు.

 

గడ్కరీపై కిషన్ రెడ్డి ప్రశంసల జల్లు

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కృషి వల్ల ఏ గ్రామానికి వెళ్లినా జాతీయ రహదారులు కనిపిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గాయన్నారు. ‘‘అమెరికాను తలదన్నేలా భారత్‌లో జాతీయ రహదారులు ఉన్నాయి. నితిన్‌ గడ్కరీ దగ్గరకు ఏ పార్టీ ఎంపీ వెళ్లి అడిగినా కాదనకుండా ఇస్తారు. ఆయన్ను ఫ్లై ఓవర్ల మంత్రి అని కూడా పిలుస్తుంటారు. అంబర్‌పేట ఫ్లైఓవర్‌ ప్రారంభించుకున్నప్పటికీ సర్వీస్‌ రోడ్డు అసంపూర్తిగానే ఉంది. ఆరు ప్రాంతాల్లో భూసేకరణ పూర్తి కాకపోవడంతో సర్వీస్‌ రోడ్డు పూర్తి కాలేదు. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ ఆయా ప్రాంతాల్లో భూసేకరణ పూర్తి చేయాలి’’ అని అన్నారు.

గడ్నరీ నోటి వెంట నో అనే మాట రాదు – ఈటెల

నో అనే మాట గడ్కరీ నోటి నుంచి రాదని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. ఉప్పల్‌, కొంపల్లి కారిడార్‌లు వేగవంతం చేయాలని కేంద్రమంత్రిని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌, కరీంనగర్‌ హైవేను జాతీయ రహదారిగా ప్రకటించాలని కోరారు.

 

 

Leave A Reply

Your Email Id will not be published!