Nitish Kumar: నీతీశ్‌ కుమార్ కు ప్రధానిగా ఇండియా కూటమి ఆఫర్‌ ?

నీతీశ్‌ కుమార్ కు ప్రధానిగా ఇండియా కూటమి ఆఫర్‌ ?

Nitish Kumar: ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 293 సీట్లు సాధించి… భారత ప్రధానిగా ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి నరేంద్ర మోదీ సిద్ధమౌతున్న సంగతి తెలిసింది. అయితే ఈ కూటమిలో రెండో పెద్ద పార్టీగా చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం, మూడో పెద్ద పార్టీగా నితీశ్ కుమార్(Nitish Kumar) నేతృత్వంలోని జేడీ(యూ) కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో కూటమిలో మూడో అతి పెద్ద పార్టీగా కొనసాగుతున్న జేడీ(యూ) అధినేత బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు… కేంద్రంలోని బీజేపీను ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ‘ఇండియా’ కూటమి ప్రధాన మంత్రిగా ఆఫర్‌ ఇచ్చినట్లు జేడీ(యూ) వర్గాలు వెల్లడించాయి. అయితే, ఆయన మాత్రం ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ నేత కేసీ త్యాగి ఓ జాతీయమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ‘ఇండియా’ కూటమి నితీశ్ కుమార్ కు ఇచ్చిన ఆఫర్ దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో జేడీ(యూ) నేత కేసీ త్యాగి మాట్లాడుతూ… ‘‘ఇండియా కూటమి నీతీశ్‌ కుమార్‌ కు ప్రధాన మంత్రిగా ఆఫర్‌ ఇచ్చింది. ఆయన మాత్రం ఆ అవకాశాన్ని తిరస్కరించారు. దీని గురించి నేరుగా నీతీశ్‌(Nitish Kumar)ను కలిసేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మేము ఎన్డీయే కూటమితో ఉన్నాం. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు’’ అని త్యాగి పేర్కొన్నారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు భిన్నంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఎన్డీయే కూటమి 293 సీట్లు సాధించగా… ఇండియా కూటమి ఆ అంచనాలకు మించి 234 స్థానాలను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకునేందుకు ఇండియా కూటమి తన సంఖ్యా బలాన్ని పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిందని వార్తలు వినిపించాయి. అందుకోసం ఎన్టీయే మిత్రపక్షాలైన తెలుగు దేశం పార్టీ, జేడీ(యూ)లను తమ కూటమిలో చేర్చుకునేందుకు యత్నించిందని ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నీతీశ్‌కు వచ్చిన ఆఫర్ గురించి తాజాగా పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Nitish Kumar – త్యాగి వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ !

దీనిపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. త్యాగి చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ‘‘నీతీశ్‌ను ప్రధానిగా చేసేందుకు ఇండియా కూటమి సంప్రదించడంపై కాంగ్రెస్‌కు ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయం గురించి కేవలం ఆయనకు మాత్రమే తెలుసు’’ అని హస్తం పార్టీ నేత కేసీ వేణుగోపాల్‌ కౌంటర్‌ ఇచ్చారు.

Also Read : Narendra Modi : మోదీ ప్రమాణస్వీకారానికి రాబోయే అతిరధ మహారధులు వీరే..

Leave A Reply

Your Email Id will not be published!