సంక్రాంతి పండుగ‌ వేళ అద‌న‌పు ఛార్జీలు లేవు : ఎండీ

స్ప‌ష్టం చేసిన ద్వారకా తిరుమ‌ల రావు

విజ‌య‌వాడ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ (ఏపీఎస్ఆర్టీసీ) సంస్థ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఏపీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తీపి క‌బురు చెప్పింది. ప్ర‌తి ఏటా పండుగ‌ల సంద‌ర్బంగా ఎడా పెడా , ఇష్టానుసారంగా అద‌న‌పు ఛార్జీల భారం మోపేది. దీంతో బ‌స్సులు ఎక్కాలంటేనే జ‌నం జ‌డుసుకునే వారు. రైళ్ల‌ను , ఇత‌ర ప్ర‌త్యామ్నాయ మార్గాల వైపు చూసే వారు. దీనిని గ‌మ‌నించింది ఏపీఎస్ఆర్టీసీ సంస్థ‌. ఈ మేర‌కు మేనేజింగ్ డైరెక్ట‌ర్ ద్వార‌కా తిరుమ‌ల రావు ఆధ్వ‌ర్యంలో కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా భారీ ఎత్తున బ‌స్సులు నడ‌పాల‌ని నిర్ణ‌యించారు. స‌మావేశం అనంత‌రం ఎండీ మీడియాతో మాట్లాడారు.

ఈ సంద‌ర్బంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దాదాపు 8 వేలకు పైగా స్పెష‌ల్ బ‌స్సుల‌ను న‌డుపుతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇందులో భాగంగా అత్య‌ధికంగా హైద‌రాబాద్, బెంగ‌ళూరు, చెన్నై, బెంగ‌ళూరు, ముంబై ప్రాంతాల‌కు బ‌స్సుల‌ను న‌డుపుతున్న‌ట్లు చెప్పారు. గ‌త ఏడాది స్పెష‌ల్ ఛార్జీలు వ‌సూలు చేశామ‌ని, కానీ ప్ర‌యాణీకుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను ఈసారి అలాంటి అద‌న‌పు ఛార్జీల భారం మోప‌డం లేద‌న్నారు. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. ఇదే స‌మ‌యంలో గ్రామాలు, మండ‌లాలు, ప‌ట్ట‌ణాల‌కు య‌ధావిధిగా బ‌స్సులు న‌డుస్తాయ‌ని చెప్పారు.

అంతే కాకుండా పండుగ తర్వాత తిరిగి వచ్చే ప్రయాణికుల రద్దీని నిర్వహించడానికి ఏపీఎస్‌ఆర్టీసీ 4,575 ప్రత్యేక బస్సులను ప్రణాళిక చేసిందన్నారు ద్వార‌కా తిరుమ‌ల రావు. ఇందులో 2,500 రాష్ట్ర అంతర్గత సర్వీసులు, హైదరాబాద్‌కు 1,800 బస్సులు, బెంగళూరుకు 200 , చెన్నైకి 75 బస్సులు ఉన్నాయ‌ని తెలిపారు. ప్రయాణికులకు అనుకూలమైన విధానాన్ని పునరుద్ఘాటిస్తూ, ఏపీఎస్‌ఆర్టీసీ అన్ని ప్రత్యేక సర్వీసులు సాధారణ ఛార్జీలతో నడుస్తాయని, సంక్రాంతి సీజన్‌లో ప్రయాణికులు తమ ప్రయాణాలను సులభంగా ప్లాన్ చేసుకోవడానికి వీలుగా ముందస్తు రిజర్వేషన్లు ఛాన్స్ ఇచ్చామ‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!