Arvind Kejriwal : ఎన్ని దాడులు చేసినా ఏవీ దొరకవు
స్పష్టం చేసిన సీఎం అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal : కేంద్రంపై నిప్పులు చెరిగారు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఎక్సైజ్ పాలసీ అమలులో స్కాం చోటు చేసుకుందంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసింది.
14 మందిపై అభియోగాలు మోపింది. శుక్రవారం దేశంలోని 36 చోట్ల మద్యం పాలసీ కేసు విచారణకు సంబందించి ఈడీ సోదాలు చేపట్టింది. దీనిపై ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.
భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణలు చూస్తే నవ్వు వస్తోందన్నారు. వాళ్లు పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. ఎలాంటి ఆధారలు లేకుండా విమర్శలు చేస్తున్నారు.
వారి ప్రధాన ఉద్దేశం ఢిల్లీలో ఆప్ ఉండ కూడదని అనుకుంటున్నారు. ఇప్పటికే ప్రజలు తమ వైపు ఉన్నారని వాళ్లు తెలుసు కోలేక పోతున్నారని పేర్కొన్నారు.
ఈ మీడియా సమావేశంలో సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal) తో పాటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఉన్నారు. స్టింగ్ ఆపరేషన్ అంటున్నారు. అందులో ఆరోపణలు చేసిన వారు ఎవరో చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.
దర్యాప్తు సంస్థలన్నీ మోదీ చేతుల్లో ఉన్నాయి. నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపితే ఎవరు దోషులనేది తేలుతుందన్నారు అరవింద్ కేజ్రీవాల్.
ఎన్ని సంస్థలు రంగంలోకి దిగినా లేదా దాడులు చేసినా వాళ్లకు దొరికేది ఏమీ ఉండదన్నారు. ఉంటే కదా దొరికేందుకు అని ఎద్దేవా చేశారు.
ఎక్సైజ్ పాలసీకి సంబంధించి రూ. 1.50 లక్షల కోట్ల మోసం జరిగిందని ఓ బీజేపీ నేత ఆరోపించారు. ఢిల్లీ మొత్తం బడ్జెట్ రూ. 70,000 కోట్లు. దీని విలువ రూ. 4,000 కోట్లని మరో నేత చెప్పాడు.
కొంత మంది నాయకులు రూ. 1,100 కోట్లు అన్నారు. మొత్తంగా చూస్తే సీబీఐ తన ఎఫ్ఐఆర్ లో రూ.1 కోటి విలువైన మోసం జరిగిందని పేర్కొందన్నారు కేజ్రీవాల్.
Also Read : కాంగ్రెస్ రెబల్స్ చేరికలో మాజీ సీఎం పాత్ర