Operation Sindhu: ఇరాన్ లో చిక్కుకున్న భారతీయుల కోసం ‘ఆపరేషన్ సింధు’
ఇరాన్ లో చిక్కుకున్న భారతీయుల కోసం ‘ఆపరేషన్ సింధు’
Operation Sindhu : ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమవుతుండటంతో ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల్ని తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. దీనికి ‘ఆపరేషన్ సింధు (Operation Sindhu)’ అని నామకరణం చేసినట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా టెహ్రాన్‌లోని ఇండియన్ ఎంబసీ అక్కడి హై-రిస్క్ జోన్లలో ఉన్న భారతీయులను ఇరాన్‌లోని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. టెహ్రాన్‌లోని ఇండియన్ ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు సాగించాలని అక్కడి భారతీయులను కోరింది. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్న వేళ… ఉత్తర ఇరాన్ నుంచి జూన్ 17న ఆర్మేనియాకు 110 మంది విద్యార్థులు చేరుకున్నారు.
‘ఆపరేషన్ సింధు (Operation Sindhu)’ లో భాగంగా తొలి దఫాగా జూన్ 17న ఉత్తర ఇరాన్ (Iran) నుంచి అక్కడి భారత రాయబార కార్యాలయం విజయవంతంగా అర్మేనియాకు తరలించిన 110 మంది భారతీయ విద్యార్థులను భారత్ కు తీసుకువస్తున్నారు. అర్మేనియా క్యాపిటల్ సిటీ యెరవాన్ నుంచి బుధవారంనాడు ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి వీరు బయలుదేరారు. ఈ విమానం గురువారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకుంటుందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. ఈ సందర్భంగా విదేశాల్లో ఉన్న తన పౌరుల భద్రతకు భారత్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని జైశ్వాల్ స్పష్టం చేసారు.
Operation Sindhu – టెహ్రాన్‌లోని ఇండియన్ ఎంబసీ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్స్
1.For calls only: +98 9128109115, +98 9128109109
2.For WhatsApp: +98 9010445557, +98 9015993320, +91 8086871709
ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్ నగరం దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి భారత ఎంబసీ ఇప్పటికే ప్రత్యేక అడ్వైజరీని జారీ చేసింది. తక్షణమే ఆ నగరాన్ని వీడాలని కోరింది. టెహ్రాన్ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని భారతీయులకు సూచించింది. ఇప్పటివరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్యాధికారులతో కాంటాక్ట్ అవ్వాలని కోరిన విషయం తెలిసిందే.
కాగా, భారతీయులను సురక్షితంగా తరలించేందుకు సహకరించిన ఇరాన్, అర్మేనియా ప్రభుత్వాలకు భారత ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. ఇరాన్‌లో 4,000 మంది భారతీయులుండగా, వారికి సగం మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలోనూ ఎక్కువ మంది జమ్మూకశ్మీర్‌కు చెందిన వారున్నారు. వీరు ప్రధానంగా మెడికల్, ఇతర వృత్తివిద్యా కోర్టులు చేస్తున్నారు. ఇరాన్‌లోని ఉర్మియా మెడికల్ యూనివర్శిటీలో ఎక్కువ మంది విద్యాభ్యాసం చేస్తున్నట్టు జమ్మూ అండ్ కశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలిపింది.
దిల్లీ తెలంగాణ భవన్ లో హెల్ప్‌లైన్
ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర దాడుల నేపథ్యంలో ఆ రెండు దేశాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటున్న తెలంగాణవాసులకు సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం దిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ ప్రారంభించింది. ఇప్పటివరకూ రాష్ట్ర వాసులు ఎవరూ ప్రభావితం అయినట్లు సమాచారం లేకపోయినప్పటికీ… భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ముందుజాగ్రత్తగా ఈ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా తాము ఉంటున్న దేశాల్లో గానీ, ప్రయాణాల్లో గానీ ఇబ్బంది పడుతున్న తెలంగాణ వాసులు కింద పేర్కొన్న నంబర్లను సంప్రదించవచ్చని తెలంగాణభవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. వందన- రెసిడెంట్ కమిషనర్ పీఎస్- +91 9871999044, జి.రక్షిత్‌నాయక్, లైజన్ ఆఫీసర్- +91 9643723157, జావేద్ హుస్సేన్, లైజన్ ఆఫీసర్- +91 9910014749, సీహెచ్ చక్రవర్తి, పౌరసంబంధాల అధికారి- +91 9949351270.
Also Read : INS Arnala: భారత నౌకాదళం అమ్ముల పొదిలో ‘ఐఎన్‌ఎస్ అర్నాల’
