Operation Sindoor: 36 ప్రాంతాల్లో 400 డ్రోన్లతో పాకిస్తాన్ దాడులు – భారత్‌

36 ప్రాంతాల్లో 400 డ్రోన్లతో పాకిస్తాన్ దాడులు - భారత్‌

Operation Sindoor : భారత్‌ లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి పాకిస్థాన్‌ డ్రోన్‌ దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌ లోని 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని 300 నుంచి 400 డ్రోన్లతో పాక్‌ ఈ దాడులకు పాల్పడినట్లు భారత సైన్యం తెలిపింది. పాకిస్థాన్‌(Pakistan) తన పౌర విమానాలను రక్షణ కవచాలుగా ఉపయోగిస్తోందని వెల్లడించింది. ఆపరేషన్‌ సిందూర్‌ కు సంబంధించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ… కర్నల్‌ సోఫియా ఖురేషీ, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.

Operation Sindoor Updates

ఈ సందర్భంగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మీడియాతో మాట్లాడుతూ… భారత గగనతల రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, నిఘా సమాచార సేకరణే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం తుర్కియేకు చెందిన ‘ఆసిస్‌గార్డ్‌ సోంగర్‌’ డ్రోన్లను ప్రయోగించినట్లు తెలిసిందన్నారు.
‘‘గురువారం రాత్రి రెచ్చగొట్టే చర్యలకు దిగిన పాకిస్థాన్‌.. నియంత్రణ రేఖ వెంట ఉల్లంఘనకు పాల్పడుతూ దాడులకు తెగబడింది. భారత(India) సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. పాకిస్థాన్‌ నుంచి 300 నుంచి 400 డ్రోన్ల వరకు వచ్చాయి. వీటిలో అనేక డ్రోన్లను కూల్చేశాం. పంజాబ్‌ సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉన్నాం. ఈ దాడుల్లో అనేకమంది గాయపడ్డారు. పాక్‌ దాడులను భారత వాయుసేన సమర్థంగా అడ్డుకుంది. ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా పాక్‌ దాడులు చేస్తోంది. ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు పాక్‌ ప్రయత్నిస్తోంది.

పాకిస్థాన్‌ డ్రోన్‌, క్షిపణి దాడులు మొదలుపెట్టినప్పటికీ.. అక్కడి పౌర విమానాలకు గగనతలాన్ని మూసివేయలేదు. కరాచీ, లాహోర్‌ మధ్య విమాన సర్వీసులు నడుస్తూనే ఉన్నాయి. తమ దాడులకు భారత్‌ నుంచి ప్రతిస్పందన ఉంటుందని తెలిసీ.. పౌర విమానాలను పాకిస్థాన్‌ రక్షణ కవచంగా వాడుకుంటోంది. ఇది భారత్‌-పాక్‌ మధ్య అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో వెళ్లే విమానాలతోపాటు అక్కడి పౌర విమానాలకు సురక్షితం కాదు. అంతర్జాతీయ విమానాలను దృష్టిలో ఉంచుకొని భారత వాయుసేన పూర్తి సంయమనంగా వ్యవహరించింది’’ అని రక్షణశాఖ ప్రతినిధులు కర్నల్‌ సోఫియా ఖురేషీ, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌లు వెల్లడించారు.

Also Read : Vikram Misri: ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాకిస్తాన్ సైనిక అధికారులు

Leave A Reply

Your Email Id will not be published!