Operation Sindoor: ప్రత్యేక ‘పాఠం’గా ఆపరేషన్‌ సిందూర్‌ ! ఎన్‌సీఈఆర్‌టీ సన్నాహాలు ?

ప్రత్యేక ‘పాఠం’గా ఆపరేషన్‌ సిందూర్‌ ! ఎన్‌సీఈఆర్‌టీ సన్నాహాలు ?

Operation Sindoor : పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా పాకిస్థాన్‌లో ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ తో దాయాది దేశం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఇదే అంశంపై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం చర్చించనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు దీనిపై అవగాహన పెంచేందుకు గాను ఓ ప్రత్యేక పాఠంగా చెప్పేందుకు నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, రెగ్యులర్‌ పాఠ్యాంశంగా కాకుండా ఓ కేస్‌ స్టడీ రూపంలో దీన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Operation Sindoor Lession Hard Copy

విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావన పెంపొందించేందుకు గాను ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) అంశాన్ని పాఠ్యాంశంలో చేర్చే యోచనలో ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గతంలో ఓసారి పేర్కొన్నారు. దేశ పురోగతిని వివరించడం, వారిలో సానుకూల భావాన్ని పెంచడంలో భారత చరిత్రను స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ క్రమంలోనే ఆపరేషన్‌ సిందూర్‌ను ఉన్నత తరగతుల వారికి బోధించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

ముఖ్యంగా పాకిస్థాన్‌పై చేపట్టిన సైనిక ఆపరేషన్‌లో సాయుధ దళాల పాత్ర, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు తీసుకునే విధానం, ప్రాంతీయ స్థిరత్వం, దౌత్యపరమైన చిక్కులు తదితర అంశాలు ఈ కేస్‌ స్టడీలో పొందుపరచనున్నట్లు సమాచారం. తద్వారా కరెంట్‌ అఫైర్స్‌, జాతీయ సంఘటనలకు సంబంధించి విద్యార్థులకు తరగతి గదిలోనే వివరణాత్మక సమాచారాన్ని అందించవచ్చన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది.

పహల్గాం ఉగ్రదాడులకు ప్రతీకారంగా పీవోకేతోపాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ మే 7 నుంచి నాలుగు రోజుల పాటు ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. ఈ చర్యతో దాయాదికి తీవ్ర నష్టం వాటిల్లింది. స్పష్టమైన ప్రణాళిక, సాయుధ దళాలు, విదేశాంగ విభాగాల మధ్య సమన్వయంతో జరిపిన ఈ ఆపరేషన్‌పై భారత్‌లో అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి.

Also Read : Upendra Dwivedi: భారత సైన్యంలో కొత్త శక్తి ‘రుద్ర’

Leave A Reply

Your Email Id will not be published!