Outer Ring Train: 392 కి.మీ. లలో హైదరాబాద్ లో ‘ఔటర్ రింగ్ రైలు’ ప్రాజెక్టు
392 కి.మీ. లలో హైదరాబాద్ లో ‘ఔటర్ రింగ్ రైలు’ ప్రాజెక్టు
Outer Ring Train : హైదరాబాద్ మహానగరంలో ప్రతిష్ఠాత్మక ‘ఔటర్ రింగ్ రైలు’ ప్రాజెక్టు తుది ఎలైన్‌మెంట్ ఖరారైంది. దేశంలో మొట్టమొదటి సారిగా 392 కిలోమీటర్ల పొడవున ఈ ‘ఔటర్ రింగ్ రైలు’ (Outer Ring Train) ప్రాజెక్టు రానుంది. రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలు, 14 మండలాలను కలుపుతూ దీన్ని చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మార్గంలో నూతనంగా 26 రైల్వే స్టేషన్లు రానున్నాయి. మొత్తం నిర్మాణానికి రూ.12,070 కోట్లు అవుతుందని అంచనా. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట జిల్లాల పరిధిలో రింగ్ రైలు మార్గం రానుంది. ఆలేరు, వలిగొండ, గుళ్లగూడ, మాసాయిపేట, గజ్వేల్ మీదుగా ఔటర్ రింగ్ రైలు ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు.
Outer Ring Train in Hyderabad
రెండేళ్ల క్రితం రైల్వే శాఖ తుది సర్వేకు ఆమోదం తెలిపినప్పుడు ఔటర్ రింగ్ రైలు ప్రతిపాదిత మార్గం దూరం 508 కిలోమీటర్లు. తుది సర్వేలో ఈ ప్రాజెక్టుకు దక్షిణ మద్య రైల్వే (South Central Railway) అధికారులు మూడు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి ప్రతిపాదన 508.45 కి.మీ., రెండోది 511.51 కి.మీ., మూడోది 392.02 కి.మీ. ఈ మూడింటిని పరిశీలించిన కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గనుల మంత్రి కిషన్‌రెడ్డి మొదటి రెండు ప్రతిపాదనలు రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్)కు దూరంగా ఉంటాయని… మూడోది పరిగణనలోకి తీసుకోవాలని సూచించడంతో దక్షిణ మద్య రైల్వే ఈ ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేసింది. 508 కి.మీ. మార్గంతో పోలిస్తే ప్రస్తుతం ఖరారు చేసిన ఎలైన్‌మెంట్… దూరం తక్కువైనా అభివృద్ధికి అధిక అవకాశాలున్న ప్రాంతాలకు దగ్గరలో రానుంది. 392 కి.మీ.లతో రింగ్ రైలు ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రైల్వే బోర్డుకు పంపించేందుకు దక్షిణ మద్య రైల్వే సిద్ధం అవుతోంది.
హైదరాబాద్ (Hyderabad) చుట్టూ 361 కి.మీ. మేర ఆర్‌ఆర్‌ఆర్ రానుంది. దానికి 3-5 కి.మీ. దూరంలోనే వచ్చేలా ఔటర్ రింగ్ రైలు ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. రెండుచోట్ల ఈ దూరం 11 కి.మీ. ఉంటుంది. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టులో ఆరు చోట్ల ‘రైల్ ఓవర్ రైల్’(ఆర్వోఆర్) వంతెనలు రానున్నాయి. కొత్త లైన్ ను ఎత్తుగా ఫ్లైఓవర్ లో నిర్మిస్తారు. మాసాయిపేట, గుళ్లగూడ, బూర్గుల, వలిగొండ, వంగపల్లి, గజ్వేల్ ఆర్వోఆర్ ప్రాంతాలుగా ప్రతిపాదించారు.
‘ఔటర్ రింగ్ రైలు’ ప్రాజెక్టు తో సామాజిక ఆర్థిక లాభాలు
ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుతో పరిసర ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుంది. ఆర్‌ఆర్‌ఆర్‌కు రింగ్ రైలు మార్గాన్ని దగ్గరలోకి తీసుకురావడంతో రోడ్డు, రైలు మార్గంతో రవాణా ఆధారిత అభివృద్ధి జోరందుకుంటుంది.
ఇంటిగ్రేటెడ్ మల్టీమోడల్ కనెక్టివిటీ: రింగ్ రైలు ప్రాజెక్టుతో ఆయా రైల్వేస్టేషన్ల నుంచి నగరానికి బస్సులు, మెట్రో రైలు వంటి రవాణాసేవలతో మల్టీమోడల్ కనెక్టివిటీ వస్తుంది.
పర్యావరణహిత ప్రజారవాణా: ప్రజారవాణా వ్యవస్థ వినియోగం పెరగడం.. తద్వారా ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటం తగ్గుతుంది. దీంతో ఇంధన వాడకం, కాలుష్య ఉద్గారాలు తగ్గుతాయి. పర్యావరణానికి అనుకూలమైన రవాణా విధానం ఏర్పడుతుంది.
శివారు ప్రాంతాల అభివృద్ధి: హైదరాబాద్‌కు పొరుగు జిల్లాలతో మెరుగైన రైలు కనెక్టివిటీ వస్తుంది. దీంతో అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం కాకుండా ఇతర ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. కొత్త టౌన్‌షిప్‌ల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు తోడ్పడుతుంది.
Also Read : KTR: డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం – కేటీఆర్
