Owaisi : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీపై నిప్పులు చెరిగారు.
మునుగోడులో తమ అభ్యర్థి గెలుపొందేందు కోసం బీజేపీ విద్వేష పూరిత కామెంట్స్ చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు.
ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే టి. రాజా సింగ్(Raja Singh) కావాలనే ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. దీని వెనుక బీజేపీ హైకమాండ్ హస్తం ఉందన్నారు.
వారి ప్రమేయంతోనే గత కొంత కాలంగా దేశంలోని పలు ప్రాంతాలలో బీజేపీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు ఇష్టానుసారంగా ప్రవక్తను టార్గెట్ గా చేసుకుని వ్యాఖ్యానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంలో రాజా సింగ్ పై తగిన చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. ఇప్పటి దాకా తెలంగాణలో అంతా ప్రశాంతంగా ఉందని కానీ బీజేపీ మాత్రం విద్వేష పూరిత రాజకీయాలతో పబ్బం గడపాలని చూస్తోందన్నారు.
మంగళవారం ఎంపీ మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అంశమన్నారు. వేరొకరి మనోభావాలను కించ పరిచేలా మాట్లాడటం బీజేపీ శ్రేణులకు పరిపాటిగా మారిందన్నారు ఓవైసీ(Owaisi) .
గత ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ ప్రశాంతంగా ఉందన్నారు. కానీ బీజేపీ మాత్రం అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతోందంటూ ధ్వజమెత్తారు ఎంఐఎం చీఫ్.
ఇదిలా ఉండగా ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ పై పలు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు లు అందాయి. కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.
కాగా తాను ఎలాంటి కామెంట్ చేయలేదన్నారు రాజా సింగ్. ఫరూఖీపై చేశానని ఒప్పుకున్నారు.
Also Read : ఫారూఖీని తిట్టా ప్రవక్తను అనలేదు