Pakistan: గంటల్లోనే పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన ! భారత్, పాక్‌ సరిహాద్దుల్లో మళ్ళీ ఉద్రిక్తత !

గంటల్లోనే పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన ! భారత్, పాక్‌ సరిహాద్దుల్లో మళ్ళీ ఉద్రిక్తత !

Pakistan : భారత్, పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీరించాయని ఇరుదేశాల ప్రతినిధులతో పాటు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటలకే పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ది ప్రదర్శించింది. కాల్పులను విమరిస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటలకే… మళ్ళీ పాకిస్తాన్ దాడులకు తెగబడింది. జమ్మూ, కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహాద్దుల్లోని పలు చోట్ల డ్రోన్లను ప్రయోగించింది. అయితే భారత్ సైన్యం వాటిని సమర్థంగా నిలువరించింది.

దీనితో భారత్(India), పాకిస్తాన్ సరిహాద్దుల్లో శనివారం రాత్రి మళ్లీ కాల్పుల కలకలం రేగింది. జమ్మూ కశ్మీర్‌ లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్‌(Pakistan)డ్రోన్లు కనిపించాయి. దీనితో గగనతల రక్షణ వ్యవస్థల్ని ఉపయోగించి… భారత్(India) సైన్యం వాటిని కూల్చేశారు. అఖ్నూర్, పింజార్, బారాముల్లా, అనంతనాగ్, బట్వారాలలో పాక్‌ డ్రోన్లను సైన్యం కూల్చేసింది. శ్రీనగర్‌ లో పలుచోట్ల పేలుళ్లు చోటుచేసుకున్నాయి. దీనితో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాకా శ్రీనగర్‌లో పేలుడు శబ్దాలు వినిపించడంపట్ల ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా(Omar Abdullah) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ సంగతేంటని ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. పాక్‌ చర్యను తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనను కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. ఇది అత్యంత దుర్మార్గమని మండిపడింది. దీనికి పూర్తిగా పాక్‌ దే బాధ్యత అని, మన సైన్యం బాధ్యతాయుతంగా స్పందిస్తూ జవాబిస్తోందని పేర్కొంది. పాక్‌ కూడా పరిస్థితిని సమీక్షించి తగిన తీవ్రతతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికింది. ఇలాంటివాటిని బలంగా తిప్పికొట్టాలని మన సైన్యాన్ని ఆదేశించినట్లు తెలిపింది.

Pakistan – గుజరాత్, కశ్మీర్, రాజస్థాన్‌లలో మళ్లీ బ్లాకౌట్‌ విధింపు

ఇరుదేశాల అధికారుల నుండి కాల్పుల విరమణ ప్రకటన రాగానే పంజాబ్‌ లో బ్లాకౌట్‌ను అధికారులు ఎత్తేశారు. అయితే ఒప్పందాన్ని పాక్‌ ఉల్లంఘించినట్లు వార్తలు రాగానే దానిని తిరిగి విధించారు. గుజరాత్, కశ్మీర్, రాజస్థాన్‌లలో బ్లాకౌట్‌ ను కొనసాగిస్తున్నారు. గుజరాత్‌లోని కచ్‌ లోనూ డ్రోన్లు కనిపించాయి. కశ్మీర్‌ లోని నగ్రోటా వద్ద చొరబాట్లకు జరిగిన యత్నాన్ని కాల్పులతో సైన్యం వమ్ము చేసింది.

భారత్, పాక్‌(Pakistan) ఉద్రిక్తతలు చల్లారినట్లే చల్లారి మళ్లీ వేడందుకున్నాయి. అమెరికా, మరికొన్ని దేశాల దౌత్యంతో… రెండుదేశాల అంగీకారంతో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ‘సైనిక కార్యకలాపాల డైరెక్టర్‌ జనరల్‌’ స్థాయిలో రెండు దేశాల అధికారుల మధ్య చర్చలు ఫలించాయి. అయితే కాసేపటికే పాకిస్థాన్‌(Pakistan) మళ్లీ దాడులకు తెగబడింది. సరిహద్దులోని పలు ప్రాంతాలపైకి భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ… సాయంత్రం 6 గంటల సమయంలో కాల్పుల విరమణపై ప్రకటన చేశారు. రెండు దేశాలు శాంతికి అంగీకరించాయని అంతకుముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం… భూతల, గగనతల, సాగరజలాల్లో అన్నిరకాల కాల్పులు, సైనిక చర్యలను రెండు దేశాలు నిలిపేస్తాయి. దీనికి పాకిస్థాన్‌ బేషరతుగా అంగీకరించిందని మిస్రీ తెలిపారు.

‘రెండు దేశాల డీజీఎంవోలు శనివారం సాయంత్రం 3.35 గంటల సమయంలో నేరుగా మాట్లాడుకున్నారు. రెండువైపులా అన్నిరకాల సైనిక కార్యకలాపాలను నిలిపేయాలని నిర్ణయించారు. ఎలాంటి ముందస్తు, తదుపరి షరతులు లేకుండా, ఇతర అంశాలతో ముడిపెట్టకుండా పాక్‌ అంగీకారం తెలిపిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పాక్‌ విదేశాంగ మంత్రి ఇశాక్‌ డార్‌ కూడా కాల్పుల విరమణను ధ్రువీకరించారు. తాము ఎల్లప్పుడూ ఈ ప్రాంతంలో శాంతి, భద్రతను కోరుకుంటామని స్పష్టంచేశారు. కాల్పుల విరమణ అమల్లోకి రాగానే సరిహద్దులోని చాలా ప్రాంతాల్లో బ్లాకౌట్‌ ఎత్తేశారు.

శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్‌ లోని 8 సైనిక స్థావరాలపై భారత్‌ శనివారం తెల్లవారుజామున విరుచుకుపడింది. రఫీక్, మురీద్, చక్లాలా, రహీంయార్‌ ఖాన్, సుక్కుర్, చునియన్‌. పర్సూర్, సియాల్‌కోట్‌ స్థావరాలపై మన యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ఇందులో వైమానిక స్థావరాలు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు, రాడార్‌ సైట్లు, ఆయుధ నిల్వ కేంద్రాలున్నాయి. కచ్చితమైన లక్ష్యాలతో ఈ దాడులు చేశామని, పౌర నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ వెల్లడించారు.

జమ్మూలోని నియంత్రణ రేఖకు ఆవలివైపు పాక్‌ సైనిక శిబిరాన్ని భారత దళాలు ధ్వంసం చేశాయి. సరిహద్దులు దాటేందుకు ఉగ్రవాదులు దీనిని లాంచ్‌ప్యాడ్‌గా వాడుకుంటున్నారు. దీనితోపాటు ట్యూబ్‌ డ్రోన్లను భారత్‌పై ప్రయోగించడానికి వీలుగా ఇక్కడ లాంచ్‌ప్యాడ్‌ ఉంది. దానిని కూడా భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. భారత్‌ దాడులను పాక్‌ సైన్యం అధికార ప్రతినిధి షరీఫ్‌ చౌధరి ధ్రువీకరించారు. తాము వాటిని అడ్డుకున్నామని తెలిపారు. భారత్‌ దాడుల తీవ్రతను పెంచడంతో ప్రతీకార దాడులకు ‘బున్‌యాన్‌ అల్‌ మార్సోస్‌’ (ఇనుప గోడ) పేరుతో ఎదురుదాడి చేస్తున్నట్లు పాక్‌ తెలిపింది. మధ్యశ్రేణి ఫతే-1 క్షిపణుల్ని ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది.

పాక్‌ డ్రోన్లు, క్షిపణుల కూల్చివేత

పాక్‌ కవ్వింపు చర్యలను శనివారం భారత్‌ విజయవంతంగా అడ్డుకుంది. డ్రోన్లు, దీర్ఘశ్రేణి ఆయుధాలు, ఫైటర్‌ జెట్లతో జమ్మూ, పంజాబ్‌లలోని పౌర ఆవాసాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు ఆ దేశం ప్రయత్నించింది. మొత్తం 26 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. శ్రీనగర్, అవంతీపొరా, ఉధంపుర్‌లలోని వైమానిక స్థావరాల సమీపంలో మెడికేర్‌ సెంటర్, పాఠశాల లక్ష్యంగా దాడులు చేసింది. అర్ధరాత్రి దాటాక 1.40 గంటలకు పలు హైస్పీడ్‌ క్షిపణులతో పంజాబ్‌లోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో మన స్థావరాల సమీపంలో స్వల్పనష్టం వాటిల్లిందని కర్నల్‌ సోఫియా ఖురేషీ తెలిపారు. దాడులనూ విజయవంతంగా తిప్పికొట్టామని స్పష్టం చేశారు.

ఉధంపుర్, పఠాన్‌కోట్, ఆదంపుర్, భుజ్‌ వైమానిక స్థావరాలపై పాక్‌(Pakistan) దాడుల కారణంగా స్వల్ప నష్టం జరిగిందని వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ తెలిపారు. ఆదంపుర్‌లోని ఎస్‌-400 రక్షణ వ్యవస్థను, సూరత్‌గఢ్, సిర్సా వైమానిక స్థావరాలను, నగ్రోటాలోని బ్రహ్మోస్‌ స్థావరాన్ని, దేహ్రాంగ్యారీలోని ఆయుధ సామగ్రిని, చండీగఢ్‌లోని మందుగుండు డిపోను ధ్వంసం చేశామని పాక్‌ చేసిన ప్రకటనలు పచ్చి అబద్ధమని స్పష్టంచేశారు. పంజాబ్, రాజస్థాన్‌లలో చెక్కుచెదరకుండా ఉన్న వైమానిక స్థావరాల తాజా చిత్రాలను ఆమె మీడియా సమావేశంలో ప్రదర్శించారు. శ్రీనగర్, పఠాన్‌కోట్‌ ప్రాంతాల్లో శనివారం ఉదయం భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు పేర్కొన్నారు. దాల్‌ సరస్సులో క్షిపణి లాంటి వస్తువు పడింది. దీంతో భద్రతా బలగాలు, బాంబు నిర్వీర్య దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. జమ్మూలోని శంభూ ఆలయం సమీపంలోనూ పాక్‌ క్షిపణి శకలాలు దొరికాయి.

పాక్ దాడుల్లో అదనపు డిప్యూటీ కమిషనర్‌ మృతి

పాక్‌ ఫిరంగి గుళ్ల దాడుల్లో ఏడుగురు మరణించారు. 8 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లు సహా పలువురు గాయపడ్డారు. చనిపోయిన వారిలో జమ్మూకశ్మీర్‌(Jammu Kashmir) అధికారి ఒకరు, బీఎస్‌ఎఫ్‌ ఎస్సై ఒకరు ఉన్నారు. పాక్‌ శతఘ్ని రాజౌరీలోని ఓ ఇంటిపై పడింది. ఈ దాడిలో అదనపు డిప్యూటీ కమిషనర్‌ రాజ్‌కుమార్‌ థాపా మరణించారు. ఆయన సహచరులిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్‌ఎస్‌ పురాలో జరిగిన ఘటనలో బీఎస్‌ఎఫ్‌ ఎస్సై మహమ్మద్‌ ఇంతియాజ్‌ అసువులు బాశారు. రాజౌరీలోని పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో రెండేళ్ల చిన్నారి సహా ఇద్దరు చనిపోయారు. పూంఛ్‌ జిల్లాలో పాకిస్థాన్‌ జరిపిన కాల్పుల్లో సుబేదార్‌ పవన్‌కుమార్, 55 ఏళ్ల మరో మహిళ మరణించారు. ఆర్‌ఎస్‌ పురా సెక్టార్‌లో మరో వ్యక్తి చనిపోయారు.

Also Read : Supreme Court: కోర్టు ఆదేశాల ఉల్లంఘనకు తగిన మూల్యం చెల్లించుకున్న డిప్యూటీ కలెక్టర్‌

Leave A Reply

Your Email Id will not be published!