Palla Srinivasarao: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు !

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు !

Palla Srinivasarao: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుకు ఇటీవల మంత్రివర్గంలో వ్యవసాయ శాఖా మంత్రిగా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో బీసీ-యాదవ వర్గానికి చెందిన పల్లాకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌పై రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో పల్లా శ్రీనివాసరావు విజయం సాధించారు.

‘‘విశాఖపట్నం పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేసిన పల్లా శ్రీనివాసరావు(Palla Srinivasarao) నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షులుగా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీని నడిపించడంలో అద్భుత పనితీరు కనబర్చిన సీనియర్‌నేత, రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకి అభినందనలు. ప్రతిపక్షంలో అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొని పార్టీ బలోపేతానికి అచ్చెన్నాయుడు ఎనలేని కృషి చేశారు’’ అని చంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

Palla Srinivasarao – మరోసారి ఉత్తరాంధ్ర నేతనే వరించిన అధ్యక్ష పదవి

ఏపీ పునర్విభజన తర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇప్పటి వరకు రెండుసార్లు ఉత్తరాంధ్ర నేతలకే దక్కగా… ఇది మూడోసారి కావడం విశేషం. నవ్యాంధ్రలో మొదటి టీడీపీ అధ్యక్షుడిగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిమిడి కళా వెంకట్రావుకు అప్పగించగా… రెండో సారి అదే జిల్లాకు చెందిన కింజరాపు అచ్చెన్నాయుడిని నియమించారు. గత నాలుగేళ్లు అచ్చెన్నాయుడు ఆ పదవిలో కొనసాగుతున్నారు. అయితే, అచ్చెన్నాయుడికి మంత్రివర్గంలో చోటు లభించడంతో ఆయన స్థానంలో మరో బీసీ నేత పల్లా శ్రీనివాసరావును నియమించారు. విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మొదటి వరుసలో ఉండి పోరాటాలకు నాయకత్వం వహించారు పల్లా శ్రీనివాసరావు. మంత్రి పదవి వస్తుందని అనుయాయులంతా ఆశగా ఎదురుచూడగా… ఎప్పుడు ఏది ఇవ్వాలో చంద్రబాబుకు తెలుసు అని చెబుతూ వచ్చారు. ఇప్పడు పల్లాకు అధ్యక్ష పదవి ఖరారు చేయడంతో సరైన గుర్తింపు దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Uma Harathi IAS: ట్రైనీ ఐఏఎస్‌ గా అకాడమీకు వచ్చిన కుమార్తెకు సెల్యూట్‌ చేసిన ఐపీఎస్‌ తండ్రి !

Leave A Reply

Your Email Id will not be published!