Parag Jain : భారత నిఘా సంస్థ ‘రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్’ (రా) నూతన చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న రవి సిన్హా జూన్ 30న పదవీ విరమణ పొందిన వెంటనే ఆయన బాధ్యతలను స్వీకరిస్తారు. ‘రా’లో రెండో అత్యంత సీనియర్ అధికారి కావడంతో పరాగ్ జైన్‌కు ఈ కీలక అవకాశం లభించింది. జులై 1 నుంచి ఆయన రెండేళ్ల పాటు ఈ ముఖ్య బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఈ మేరకు ఆయన నియామక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
Parag Jain – పంజాబ్‌లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం
పరాగ్ జైన్ (Parag Jain) పంజాబ్ క్యాడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన ‘రా’లోని ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ విభాగానికి సారథ్యం వహిస్తున్నారు. ఈ విభాగం దేశ గగనతల నిఘాకు సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తుంది. మానవ గూఢచర్యం, సాంకేతిక నిఘా అంశాలను మిళితం చేయడంలో ఆయన నిపుణుడు. ‘సూపర్ గూఢచారి’గా ఆయనకు పేరుంది. చండీగఢ్ లో ఎస్‌ఎస్‌పీ హోదాలో, లూధియానాలో డీఐజీగా పరాగ్ వ్యవహరించారు. భటిండా, మన్సా, హోషియార్‌పూర్ జిల్లాల్లోనూ వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఆయా చోట్ల ఉగ్రవాద కార్యకలాపాలపై ఆయన ఉక్కుపాదం మోపారు. 2021 జనవరి 1న పరాగ్‌కు పంజాబ్ డీజీపీగా పదోన్నతి లభించింది.
ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్రపోషించిన పరాగ్
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ జరిపిన దాడులకు వ్యూహరచన చేయడంలో, అవసరమైన నిఘా సమాచారాన్ని అందించడంలో పరాగ్ కీలకపాత్ర పోషించారు. కేంద్ర ప్రభుత్వం 370 అధికరణాన్ని రద్దు చేశాక, పాక్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన దాడులు నిర్వహించినప్పుడు ‘రా’ తరఫున జమ్మూకశ్మీరులో పరాగ్ విధులు నిర్వర్తించారు. భారత్‌కు పదేపదే హెచ్చరికలు చేసిన కెనడాలోని ఖలిస్థానీ ఉగ్రవాదుల వ్యవస్థలపై ఆయన కన్నేసి ఉంచారు.
Also Read : Uttarakhand : ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు ! 9 మంది గల్లంతు !
