Pawan Kalyan: రుషికొండ ప్యాలెస్ ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

రుషికొండ ప్యాలెస్ ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Pawan Kalyan : గత వైసీపీ ప్రభుత్వం రుషికొండలోని (Rushikonda) టూరిజం భవనాల నిర్మాణం కోసం రూ.453 కోట్ల ప్రజాధనాన్ని వృదాగా ఖర్చు చేశాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆరోపించారు. మొత్తం 69 ఎకరాల్లో 7 బ్లాకులుగా నిర్మించాలని పనులు ప్రారంభించగా… రూ.164 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన పనులు… నాలుగు బ్లాకులు పూర్తయ్యే సరికే రూ. 453 కోట్లకు చేరిందన్నారు. గతంలో ఏడాదికి రూ.7 కోట్లు ఆదాయం వచ్చే రిసార్టులను కూల్చేసి ఇప్పుడు కోటిన్నర రూపాయలు కేవలం విద్యుత్ బిల్లులకే వెచ్చించే స్థితికి వైసీపీ (YCP) నాయకులు తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. విశాఖ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం జనసేన పార్టీ మంత్రులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులతో కలసి గత ముఖ్యమంత్రి నివాసం కోసం నిర్మించుకున్న ప్యాలెస్ లను సందర్శించారు. ఈ సందర్భంగా ప్యాలెస్ లోని పలు గదులను పరిశీలించారు. విలాసవంతమైన భవనాలు, సువిశాల ప్రాంగణాలు, అత్యాధునిక వసతులు, ఖరీదైన ఫర్నిచర్ తో కూడిన నిర్మాణాలను చూసి ప్రజా ధనాన్ని ఏ విధంగా మళ్లించేశారో అని విస్తుపోయారు.

Pawan Kalyan Visit

గత ప్రభుత్వ హయాంలో రుషికొండపై (Rushikonda) ఉన్న హరిత రిసార్ట్ స్థానంలో నిబంధనలకు విరుద్దంగా నాలుగు బ్లాకుల్లో భవనాలు నిర్మించిన విషయం విదితమే. విజయనగర, బొబ్బిలి కళింగ, గజపతి పేరిట ఇవి నిర్మితమయ్యాయి. వాటిలో విజయనగర బ్లాక్ ను నాటి ముఖ్యమంత్రి నివాసం ఉండేందుకు అత్యంత విలాసవంతంగా నిర్మించారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రుషి కొండ సందర్శనలో భాగంగా మొదట 20 వేల చదరపు మీటర్లలో నిర్మించిన విజయనగర బ్లాక్ ని పరిశీలించారు. భవనం లోనికి అడుగుపెడుతూనే అత్యంత ఖరీదైన లైటింగ్ సెట్స్, సువిశాలమైన హాలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్విచ్ వేస్తే తెరుచుకునే విధంగా ఆటోమేటిక్ డోర్ కర్టెన్స్, విసన కర్రలను పోలిన రెక్కలతో డిజైన్ చేసిన సీలింగ్ ఫ్యాన్స్ ను అధికారులు చూపించారు.

అత్యాధుక వసతులు, హిల్ వ్యూ కనబడేలా మాస్టర్ బెడ్ రూమ్ నిర్మించినట్టు నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారి ఒకరు తెలిపారు. ఆ గదిలో ఏర్పాటు చేసిన మంచాలతో పాటు సువిశాలమైన బాత్ రూమ్స్ ను మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి తిలకించారు. విజయనగర బ్లాక్ జీ ప్లస్ వన్ కి అనుమతి పొంది జీ ప్లస్ టూ నిర్మాణం చేపట్టిన విషయాన్ని అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకున్నారు. కొరియన్ స్టయిల్లో నిర్మించిన బాత్ రూమ్స్… రూ. 12 లక్షలు విలువ చేసే అత్యంత ఖరీదైన బాత్ టబ్ లను ఆసక్తిగా పరిశీలించారు. భవనం లివింగ్ రూమ్స్ నుంచి, టాప్ నుంచి హిల్ వ్యూ, సీ వ్యూలను తిలకించారు. అనంతరం సీఎంఓ కోసం నిర్మించిన కళింగ బ్లాక్ కి వెళ్లారు. 300 మందితో సమావేశం నిర్వహించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్ గది, 50 మంది చొప్పన కూర్చుని చర్చించుకునేలా నిర్మించిన నాలుగు సమావేశ మందిరాలను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పరిశీలించారు.

సమావేశ మందిరంలో సీలింగ్ పైపెచ్చు ఊడిపడడాన్ని, వస్తు సామాగ్రి నిరుపయోగంగా పడి ఉండడాన్ని గమనించారు. నిర్వహణ లేక దుమ్ము కొట్టుకుపోయిన కిటకీలను చూసి, కనీసం పారిశుధ్య నిర్వహణ చేయించాలని అధికారులకు సూచనలు చేశారు. మొత్తం నిర్మాణ అంచనా వ్యయం, ఖర్చు చేసిన మొత్తం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలసి రుషికొండ భవనాల వినియోగంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

రుషికొండ భవనాల వినియోగంపై జనసేన లెజిస్లేటివ్ పార్టీ తీర్మానం

ప్రజాధనంతో నిర్మితమైన ఈ భవనాల సద్వినియోగంపై జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం తీర్మానం చేసింది. ప్రజలు పన్నులు చెల్లించడం ద్వారా వచ్చిన ప్రభుత్వ ఆదాయానికి సంరక్షకులుగా ఉండాల్సిన బాధ్యత పాలకులదనీ… రుషికొండపై విలాస భవంతుల కోసం అంచనాలు పెంచి రూ.453 కోట్లు వై.ఎస్.ఆర్.సి.పి. పాలకులు రాళ్ళ పాల్జేశారని ఈ సమావేశం అభిప్రాయపడింది. పేరు… టూరిజం రిసార్ట్స్, కానీ ఈ భవంతులు చూస్తే ప్రజల పట్ల బాధ్యత లేని నాటి ముఖ్యమంత్రి తన కుటుంబం ఉండేందుకు రూ.వందల కోట్లు ప్రజా ధనాన్ని విలాసవంతమైన ప్యాలెస్ కోసం మళ్లించేశారనీ, పర్యావరణ విధ్వంసానికి ఒడిగట్టారని తీర్మానంలో ప్రస్తావించారు. నియంతృత్వ పోకడలతో గత పాలకుడు రూ.453 కోట్లు ప్రభుత్వ నిధులను తన చిత్తానికి తగ్గట్టు వెచ్చించి భవనాలు నిర్మింపచేశారని పేర్కొన్నారు.

ఈ భవనాలను సరైన వినియోగంలోకి తీసుకువచ్చి ప్రభుత్వ ఖజానాకుపడిన గండిని పూడ్చాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ. MICE (Meetings, Incentives, Conferences and Exhibitions) బిజినెస్ టూరిజం ద్వారా ఈ భవనాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా విశాఖపట్నానికి ఓ ఐకాన్ గా మార్చవచ్చని జనసేన లెజిస్లేటివ్ సమావేశంలో ఆలోచన చేశారు. ఈ ఆలోచనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళాలని నిర్ణయించారు. రుషికొండపై నిర్మితమైన ఈ భవనాల నిర్వహణ, నాణ్యతా ప్రమాణాలు, సేఫ్టీ ఆడిట్ పై సమీక్ష చేయాలని అభిప్రాయం వ్యక్తపరుస్తూ, ఈ భవనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రతిపాదించగా… కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ బలపరిచారు.

Also Read : KTR: బండి సంజయ్‌ ను ఆత్మీయంగా పలకరించిన కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!