Pawan Kalyan: రావివలస గ్రామస్థులతో పవన్ కల్యాణ్ ‘మన ఊరు-మాటా మంతి’
రావివలస గ్రామస్థులతో పవన్ కల్యాణ్ ‘మన ఊరు-మాటా మంతి’
ప్రజా సమస్యల పరిష్కారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి… శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్థులతో మాట్లాడారు. ‘మన ఊరు-మాటా మంతి’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని టెక్కలిలోని భవానీ థియేటర్‌లో నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులపైనా అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలపై వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో వేర్వేరు ప్రాంతాల నుంచి మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
అనంతరం సాంకేతికత ప్రపంచాన్ని ఒక ప్రపంచ గ్రామంగా ఏకం చేసిందని, ఇక్కడ క్షణాల్లో మైళ్ల దూరం చేరుకోవచ్చని అన్నారు. గ్రామాల అభివృద్ధిలో పౌరులను ప్రత్యక్షంగా పాల్గొనేలా చేయడం, వారి సమస్యలను ప్రత్యక్షంగా అర్థం చేసుకునేలా ఏపీ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మాటమంతి అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ ఓ ట్వీట్ చేశారు.
‘మన ఊరు-మాటా మంతి’ కార్యక్రమంలో భాగంగా…. గ్రామానికి వచ్చి మల్లికార్జునస్వామి క్షేత్రాన్ని సందర్శిస్తానని తెలిపారు. రావివలస ప్రజలు తమ ఆందోళనలు, ఆశలను వ్యక్తపరచడానికి ముందుకు వచ్చిన ఉత్సాహం తనను చాలా కదిలించిందని పవన్ కల్యాణ్ అన్నారు. వారు కేవలం మాట్లాడలేదు, వారి గ్రామ భవిష్యత్తును తమ చేతుల్లోకి తీసుకున్నారు, ఇది నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ చొరవ కేవలం ఒక కార్యక్రమం కాదని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఊహించిన గ్రామీణ భారత్ మహోత్సవ్ 2025 దార్శనికతను సాకారం చేయడంలో ఇది ఒక ముందడుగు అని ఉద్గాటించారు.
‘గ్రామాలను పట్టించుకోరు… అక్కడి మౌలిక సమస్యలు తీర్చరనే మాట ఇక వినపడకూడదనే ఆశయంతోనే ‘మన ఊరి కోసం మాటామంతీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. కేవలం సమస్యల గురించి మాట్లాడుకోవడమే కాదు… గ్రామాల్లో ఉండే అన్ని విషయాలను అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ గ్రామస్తులలో ఐక్యత తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రెండు గంటలపాటు సమస్యలు, గ్రామాభివృద్ధి, ఇతర ముఖ్య విషయాల గురించి చర్చిస్తే దాదాపు రూ.15 కోట్ల విలువైన పనులు ఓ గ్రామానికి మంజూరు కావడం చిన్న విషయం కాదన్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనులతోపాటు ప్రజా చైతన్యం వెల్లివిరిస్తేనే గ్రామాలు కళకళలాడుతాయని పేర్కొన్నారు. రావివలస పంచాయతీకి రూ.15 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మంజూరు చేశారు. 14 సీసీ రోడ్లు, 4 డ్రైనేజీలు, ఒక ధోబీ ఘాట్, ఒక బస్ షెల్టర్, స్కూల్ ప్రహరీ గోడ, ట్యాంక్ పునరుద్ధరణ, నీటి కాలువల పునరుద్ధరణ, శ్మశాన వాటికలలో సదుపాయాలు తదితర పనులకు నిధులు మంజూరు చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘‘గ్రామాలకు నిధులు ఇస్తేనే అభివృద్ధి జరుగుతుందనే వాస్తవం కాదు. గ్రామస్తులంతా కలిసి ఐక్యంగా ముందుకు కదలితేనే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది. గ్రామాల్లో పుట్టి పెరిగి, తరవాత ఉన్నత దశకు వెళ్లిన వారు కచ్చితంగా తమ సొంత గ్రామాన్ని మరవకూడదు. గ్రామాభివృద్ధిలో తగిన తోడ్పాటునందించాలి. గతంలో వినోదం కోసం మాత్రమే సినిమా థియేటర్లు ఉండేవి. ఇప్పుడు ఊరి సమస్యలను పరిష్కరించుకునే సామాజిక బాధ్యతకి వేదికలుగా నిలబడటం సంతోషకరం. వెండి తెర వేదికగా ప్రజలతో మాట్లాడటం గొప్ప అనుభూతి కలిగించింది.
వెంటనే పరిష్కరించే ఏర్పాట్లు చేస్తున్నాం
మన ఊరు – మాటమంతీ కార్యక్రమం ద్వారా ప్రజలు చెప్పే సమస్యలు వెంటనే పరిష్కరించేవి ఉంటే పరిష్కరిస్తాం. సమయం తీసుకునేవి ఉంటే వాటిని పరిష్కరించే సమయం గ్రామస్తులకు తెలియపర్చడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. రావివలస గ్రామంలో స్వయంభువుగా నిలిచిన అతి పెద్ద లింగాకారం ఉంది. శ్రీ ఎండల మల్లికార్జున స్వామి లింగాకార రూపం అతి విశిష్టమైనది. ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దడంపై అధికారులతో మాట్లాడి తగు ప్రణాళిక రూపొందిస్తాం. అలాగే రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో వాటి విశిష్టతలు, గొప్పదనాలు ఉన్నాయి. వాటిని గుర్తించి తగు విధంగా వాటికి బ్రాండ్ తీసుకురాగలిగితే గ్రామాల రూపురేఖలు మారుతాయి.
గ్రామ ఐక్యతే బలం
గ్రామాల్లో చిన్నచిన్న సమస్యలను తీర్చుకోవడానికి ఆ ఊరి ప్రజలు ఏకమైతే చేసుకునేవి కొన్ని ఉంటాయి. వాటిని గుర్తించి పరిష్కరించుకోవాలి. అలాగే గ్రామాల్లో పాఠశాలలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. పాఠశాలలకు కేవలం బోధనకు మాత్రమే పరిమితం కావాలి. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు, రాజకీయ, మతపరమైన సభలు జరపడానికి వీల్లేదు. అలాగే స్కూలు పిల్లలకు శారీరక దృఢత్వం అవసరం. పాఠశాలలకు కచ్చితంగా క్రీడా మైదానం ఉండాలి. దానికి ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలి. నేను గతంలో మైసూరవారిపల్లెకు వెళ్లినపుడు ఆ ఊరి ప్రజలు ఆటస్థలం కావాలని కోరారు. పంచాయతీ రికార్డుల్లో చూస్తే కనీసం ఆటస్థలానికి సెంటు భూమి లేదు. నా సొంత డబ్బుతోనే ఆటస్థలానికి కావల్సిన భూమి కొనుగోలు చేసి ఇచ్చాను. ప్రతిచోటా ఇలా నా సొంత డబ్బులను వెచ్చించాలంటే కష్టతరం అవుతుంది. కాబట్టి పంచాయతీలోని స్థలాలను పిల్లల ఆట స్థలాలుగా మార్చే ప్రక్రియ జరగాలి.
డిప్యూటీ సీఎం పవనన్నకు నా శుభాభినందనలు – మంత్రి నారా లోకేశ్
కర్ణాటక నుంచి ఏపీకి కుంకీ ఏనుగులు రప్పించిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఆయన పోస్టు చేశారు. ‘‘ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవనన్నకు నా శుభాభినందనలు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఏనుగుల విధ్వంసంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలమనేరు ప్రాంత రైతన్నలు నా దృష్టికి తెచ్చారు. అన్నదాతల ఇక్కట్లను తొలగించేందుకు పవనన్న ప్రత్యేకంగా చొరవ చూపి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు. ఏపీ అవసరాలకు మరిన్ని కుంకీ ఏనుగులు ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు’’ అని లోకేశ్ పేర్కొన్నారు.