Pawan Kalyan: ఎంకే స్టాలిన్‌ పై పవన్‌కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

ఎంకే స్టాలిన్‌ పై పవన్‌కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan : డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై (MK Stalin) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మానాడుపై డీఎంకే నేతలు రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. మా మతాన్ని ప్రశ్నించడానికి మీరెవరని ప్రశ్నించారు. హిందువు హిందువుగా ఉండకూడదా అని నిలదీశారు. దయచేసి తమను రెచ్చగొట్టవద్దని అన్నారు. హిందువులను అవమానిస్తారు… ప్రశ్నిస్తే సెక్యులరిజం అంటారని డీఎంకే నేతలపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆదివారం తమిళనాడులోని మధురైలో పర్యటించారు. మధురైలోని తిరుపరకుండ్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మ తిడల్ ప్రాంగణంలో జరిగిన మానాడులో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కి (Pawan Kalyan) బీజేపీ తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తమిళనాడు అబ్జర్వర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర ఉపాధ్యక్షులు చక్రవర్తి, రాష్ట్ర నాయకుడు, అమర్ ప్రసాద్ రెడ్డి , మధురై జిల్లా అధ్యక్షులు మారి చక్రవర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ శ్రీనివాసన్, సీనియర్ రాజకీయ నాయకులు రాధాకృష్ణన్, పలువురు జనసేన నేతలు స్వాగతం పలికారు.

Pawan Kalyan – మురుగ భక్తర్గళ్ మానాడులో పవన్ కల్యాణ్ ప్రసంగంలో ముఖ్యాంశాలు

• ధర్మం అంటే ఏంటి? దుష్ట శక్తులను తొలగించడం ధర్మం. ప్రతివారినీ సమానంగా చూడటం ధర్మం. దుష్టులను శిక్షించడం ధర్మం
• ఒక పార్టీ నాయకుడు మురుగన్ సభను తమిళనాడులో ఎందుకు చేస్తున్నావు? గుజరాత్ లేదా యూపీలో ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నాడు… వారిది విభజన ఆలోచన. ఇలాంటి వారు శివునిపై, అమ్మవారిపై కూడా రేపు ప్రశ్నలు వేస్తారు. వారిది చాలా ప్రమాదకరమైన ఆలోచన.
• నేను పదహారు ఏటే శబరిమల వెళ్లినవాణ్ణి. థైపూసం సందర్భంగా తిరుత్తణికి భక్తుల పోటును చూశాను. విభూతి పెట్టుకొని స్కూల్‌కి వెళ్లినవాడిని
• ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు. ఒక ముస్లిం కూడా వారి మతాన్ని గౌరవించవచ్చు. కానీ హిందువు తన మతాన్ని గౌరవిస్తే మాత్రం అభ్యంతరం? హిందు ధర్మాన్ని, హిందూ దేవతలను చులకన చేస్తారు. వారిది సెక్యులరిజం కాదు… సూడో సెక్యులరిజం.

• నేను 2014 లో హైదరాబాద్ లో పార్టీ స్థాపించాను… నేను తమిళనాడు లో పెరిగాను, తమిళనాడు లో సంస్కృతిని అర్ధం చేసుకున్నవాడిని, తమిళనాడు సంస్కృతిపై గౌరవాన్ని పెంచుకున్నవాడిని, ఏథెన్స్ కంటే ప్రాచీనమైన మధురై నగరంలో ఇన్ని లక్షల ప్రజల మధ్య, హిందూ సాధువుల మధ్య మాట్లాడుతానని ఎప్పుడూ ఊహించలేదు
• మురుగన్‌ను నమ్మితే విజయం తధ్యం. మురుగన్‌ను నమ్మితే ఎదుగుదల సుసాధ్యం. మురుగన్‌ను నమ్మితే శక్తి వస్తుంది. స్కంధ షష్టి కవచం మన మనస్సును ఉక్కుగా చేస్తుంది. మన జీవితాన్ని మధురంగా మార్చుతుంది
• ఎలుకల సంఖ్య ఎంత ఉన్నా, ఒక నాగుపాము గట్టిగా శబ్దం చేస్తే సరి వాటంతట అవే పరుగు తీస్తాయి. అలాగ మన శత్రువులు ఎంత మంది ఉన్నా, మురుగన్ తండ్రి శివుడి మెడలోని నాగుని చూసే పారిపోతారు. కాబట్టి, మార్పు కచ్చితంగా వస్తుంది.

• “అచమిల్లై అచమిల్లై అచమ్ ఎన్బతు ఇల్లయే” అనే మహాకవి భారతీయర్ మాటలు ధైర్యాన్ని ఇస్తాయి. మార్పు కావాలంటే ధైర్యం ఉండాలి. కష్టాన్ని ఆపేస్తే, కాలం నడక ఆపదు. అలానే, కొందరి కుత్సిత ఆలోచనలతో మురుగన్ ధర్మం ఆగదు. ఆ ధర్మం నడుస్తూనే ఉంటుంది.
• ప్రపంచపు తొలి విప్లవ నాయకుడు మురుగన్. మురుగన్‌కు బేధభావం లేదు. అందరూ సమానమే.
• మధురైలో పార్వతి దేవి స్వరూపం మీనాక్షీ అమ్మవారు… శివుడు సుందరేశ్వరిని రూపంలో కొలువయ్యారు. వారి కుమారుడు కార్తికేయుడు ఇక్కడే కొలువై ఉన్నారు. షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో తొలిది, ఆరవది ఈ ప్రాంతంలోనే ఉంది.

• ఈ తరం వారు మధురై గురించి తెలుసుకోవాలి…
మధురై అనేది మీనాక్షి అమ్మవారి పట్టణం, మీనాక్షి అమ్మవారు అంటే పార్వతి అమ్మవారి స్వరూపం. మనం మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాం. అక్క‌డ ఆశీర్వాదం పొందుతున్నాం. కుంకుమ తీసుకుంటున్నాం. ప్రసాదం తీసుకుంటున్నాం.

కానీ… ఈ తరం తెలుసుకోలేని నిజం ఒకటి ఉంది. ఒక సమయంలో మధురై ధ్వంసమైంది. ప్రకాశించాల్సిన ఆలయంలో వెలుతురు లేదు. కుంకుమ ఇవ్వాల్సిన ఆలయంలో ఇచ్చేవారూ లేరు. పూజలు జరగలేదు. ఆలయాన్ని మూసివేశారు. ఎందుకు తెలుసా?

14వ శతాబ్ద ప్రారంభంలో మధురైను మాలిక్ కఫూర్ దోచుకున్నాడు. ఆ తర్వాత 60 సంవత్సరాల పాటు మీనాక్షి ఆలయం మూసివేయబడింది. అలాంటి మధురై చీకటి కాలంలో 14వ శతాబ్దం చివరలో మళ్లీ వెలుతురు పుట్టింది. ఆ వెలుతురును వెలిగించినవాడు విజయనగర యువరాజు కుమార కంబణన్. మనం అర్థం చేసుకోవాల్సింది… మన విశ్వాసాన్ని ఎవరూ నిలువరించలేరు. మన సంప్రదాయం బలమైనది. ధర్మం లోతుగా ఉంది. లోతుగా ఉండబోతుంది.

Also Read : PM Narendra Modi: ఇరాన్‌ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్‌ !

Leave A Reply

Your Email Id will not be published!