Pawan Kalyan: తిరుమల లడ్డూ అపరాచారాన్ని నిరసిస్తూ పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష !

తిరుమల లడ్డూ అపరాచారాన్ని నిరసిస్తూ పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష !

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటం ద్వారా గత ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన 11 రోజుల పాటు ఆయన దీక్షను స్వీకరించారు. 11 రోజుల పాటు ఈ దీక్షను కొనసాగించనున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… గత ఐదేళ్ళ వైసీపీ పాలనలో ఆలయాలు ధ్వంసమయ్యాయని విమర్శించారు. గత ప్రభుత్వంలో రథాలు తగులబెట్టారని.. ఆలయాలను అపవిత్రం చేశారని విమర్శించారు. రాముడి విగ్రహంలో తల తొలగిస్తే ఆనాడు పోరాడామన్నారు. ఏ మతమైనా మనోభావాలు దెబ్బతినకూడదన్నారు. ప్రసాదాల కల్తీ, నాణ్యత లేమి గురించి గతంలోనే చెప్పామని పవన్‌ గుర్తుచేశారు.

‘‘2019 నుంచి సంస్కరణల పేరుతో వైసీపీ చాలా మార్పులు చేసింది. ఆ ప్రభుత్వ హయాంలో స్వామివారి పూజా విధానాలను మార్చేశారు. శ్రీవాణి ట్రస్టు పేరుతో రూ.10 వేలు వసూలు చేశారు. దీనికి బిల్లు మాత్రం రూ.500కే ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసమే వైకాపా నాయకులు విమర్శిస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూను మహాప్రసాదంగా భావిస్తాం. మహా ప్రసాదాన్ని కూడా కల్తీ చేస్తారా ? ఆవేదన కలుగుతోంది. ఈ స్థాయిలో కల్తీ జరుగుతోందని ఊహించలేదు. అపవిత్రం చేస్తే ఏం మాట్లాడకుండా ఉండాలా ? ఇదంతా జరుగుతుంటే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఏం చేశారు ? తప్పులు చేసినవారిని జగన్‌ ఎలా సమర్థిస్తారు ? కోట్ల మంది హిందువులు స్వీకరించే ప్రసాదాన్ని అపవిత్రం చేస్తారా ? దోషులకు శిక్ష పడాల్సిందే. వేదన కలిగినప్పుడు పోరాడతాం. ఏ మతంపై దాడి జరిగినా ఇలాగే స్పందిస్తాం. పరస్పర విశ్వాసాలను గౌరవించుకోవడం చాలా అవసరం. దోషులకు కఠిన శిక్ష పడాల్సిందే. క్యాబినెట్‌ భేటీ, అసెంబ్లీలో దీనిపై చర్చ జరగాలి’’ అని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

 

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటంపై ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తనదైన శైలిలో స్పందించారు. కలియుగ ప్రత్యక్షదైవం బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని అన్నారు. ఈ నేపథ్యంలోనే ‘‘అమృతతుల్యంగా… పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం. లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను. అంటూ శనివారం సాయంత్రం తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దైనందిన విధుల్లో పాల్గొంటూనే 11 రోజుల పాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు.

Leave A Reply

Your Email Id will not be published!