Pawan Khera: ఎగ్జిట్‌పోల్స్‌ డిబేట్స్ పై కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయం !

ఎగ్జిట్‌పోల్స్‌ డిబేట్స్ పై కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయం !

Pawan Khera: 2024 సార్వత్రిక ఎన్నికల సమరం చివరిదశకు చేరుకుంది. జూన్ 1వ తేదీ శనివారం జరిగే ఏడో విడత పోలింగ్‌ తో ఎన్నికలు పూర్తవుతాయి. పోలింగ్‌ గడువు ముగిసిన వెంటనే సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడి కానున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ పై వివిధ ఛానెల్స్ ప్రత్యేకంగా డిబేట్స్ పెట్టే ఆనవాయితీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ డిబేట్స్ పై కాంగ్రెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ పై వివిధ టీవీ ఛానెళ్లు పెట్టిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిర్ణయించింది. ఈమేరకు కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వ్యవహారాల ఛైర్‌పర్సన్‌ పవన్‌ ఖేరా(Pawan Khera)… తన సోషల్ మీడియా ‘ఎక్స్‌’ లో పోస్టు చేశారు.

పోలింగ్‌ ముగిసేసరికి ప్రజలంతా ఓటుహక్కుతో తమ నాయకులను ఎన్నుకొని ఉంటారని… వారి నిర్ణయం ఈవీఎంలలో భద్రంగా ఉంటుందని… ఎన్ని చర్చలు పెట్టినా ఆ నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరని… అలాంటప్పుడు టీఆర్‌పీ రేటింగ్‌ల కోసం ఊహగానాలను ప్రచారం చేయడం ఎందుకని పవన్‌ ఖేరా(Pawan Khera) ప్రశ్నించారు. జూన్‌ 4న విడుదలయ్యే ఫలితాల్లో విజయం ఎవరిదో తేలుతుందన్నారు. ‘‘ ఎగ్జిట్ పోల్స్‌పై చర్చా కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ పాల్గొనబోదు. చర్చ ద్వారా ఏదోఒక కచ్చితమైన విషయాన్ని ప్రజలకు చేరవేయాలి. అందుకే జూన్‌ 4 తర్వాత జరిగే చర్చల్లో కాంగ్రెస్‌ పాల్గొంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు.

సాధారణంగా ప్రతిసారీ ఎన్నికలు పూర్తయిన తర్వాత వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడిస్తుంటాయి. తద్వారా ఏయే పార్టీలు ఎన్నెన్ని సీట్లు సాధిస్తాయి, ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉంది? తదితర విషయాలపై ప్రజలు ఓ అంచనాకు వస్తారు. అయితే, ప్రతిసారీ అంచనాలు నిజం కాకపోవచ్చు.

జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 వరకూ ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలపై ఎన్నికల కమిషన్ నిషేధం ఉంది. ఆ గడవు పూర్తికాగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పలు స్వంతంత్ర, మీడియా సంస్థలు ప్రకటిస్తాయి. చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. 1957 నుంచి ఇండియాలో ఎగ్జిట్ పోల్స్ ప్రారంభమయ్యాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌కు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం మాత్రం ఇదే మొదటిసారి.

Pawan Khera – కాంగ్రెస్‌ తన ఓటమిని అంగీకరించినట్లే – జేపీ నడ్డా

లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ చర్చల్లో పాల్గొనకూడదని తీసుకున్న నిర్ణయం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ తన ఓటమిని అంగీకరించినట్లేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో శనివారం జరగనున్న చివరి దశ పోలింగ్‌లో తమ ఓటును వృథా చేసుకోవద్దని ‘ఎక్స్‌’ వేదికగా ఓటర్లను కోరారు. తనకు అనుకూలమైన ఫలితాలు రాని సందర్భంలో కాంగ్రెస్‌ ముందుగానే వైదొలగడం సాధారణమేనన్నారు. ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎంలపై, ఎన్నికల ప్రక్రియపై హస్తం పార్టీ ఎలాంటి ఫిర్యాదులు చేయదని… ఓడిపోయినప్పుడు మాత్రం ఆరోపణలు చేస్తుందని విమర్శించారు.

Also Read : MLC Jeevan Reddy : ఫోన్ తప్పింగ్ అంశంపై అంశాలు వెల్లడించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!