Payal Khatik: ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన పేదింటి చదువుల తల్లి

ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన పేదింటి చదువుల తల్లి

Payal Khatik : తండ్రి రిక్షా డ్రైవర్. తల్లి సాధారణ గృహిణి. కాని ఉన్నత చదువులు చదవాలని ఆమె ఆశయం బలంగా ఉంది. ఈ నేపథ్యంలో పిల్లలకు ట్యూషన్ చెప్పుకుంటూ సంపాదించిన డబ్బుతో లండన్ లో ఉన్నత చదువుల కోసం బయలుదేరిన ఓ పేదింటి చదువుల సరస్వతి… ఎయిరిండియా ప్రమాదంలో మృతి చెందింది. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా 274 మంది మృతి చెందిన ఈ ప్రమాదంలో… ఒక్కొక్కరిది ఒక్కోక్క రకమైన దీన గాధ. కాని గుజరాత్‌లోని హిమత్‌నగర్‌ కు చెందిన పాయల్ ఖాతిక్ అనే యువతి కన్నీటి గాధ… ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Payal Khatik No More

గుజరాత్‌లోని (Gujarat) హిమత్‌నగర్‌ కు చెందిన పాయల్ ఖాతిక్ (Payal Khatik) ది అతి పేద కుటుంబం. పాయల్ తండ్రి లోడింగ్ రిక్షా నడుపుతుండగా… తల్లి మాత్రం గృహిణి. విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలని ఆశయంతో ఈ పేదింటి చదువుల సరస్వతి… వెనకడుగు వేయలేదు. ఎన్నో కష్టాలకోర్చి అవిశ్రాంతంగా పోరాడి అనుకున్నది సాధించింది. ఉన్నత చదువులకు కుటుంబ ఆర్థిక నేపథ్యం సహకరించకపోవడంతో.. తానే ట్యూషన్స్ చెప్పి దీక్షాదక్షతతో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఉదయపూర్ నుండి బిటెక్ పూర్తి చేసిన పాయల్… గత ఆరేళ్లుగా ట్యూషన్స్ చెప్పుకుంటూ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ కోసం UKకి వెళ్ళడానికి సిద్ధమయింది. ఈ నేపథ్యంలో జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం AI-171 కు లండన్ కు టిక్కెట్టు చేసుకుంది.

దీనితో పాయల్ (Payal Khatik) కుటుంబం ఉదయం 10 గంటల కంటే ముందే తమ ప్రియమైన కుమార్తెకు వీడ్కోలు పలికి ఇంటికి వెళ్లింది. తమ బిడ్డ పాయల్ లండన్‌ లోని గాట్విక్ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకుంటుందని, అక్కడ చదువులో చక్కగా రాణించగలదని పూర్తి నమ్మకంగా వాళ్లంతా ఇంటికి వెళ్లారు. అయితే, ఫ్లైట్ ఎక్కిన నిమిషం దాటకుండానే ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులు ఇంటికి చేరే లోపే అత్యంత దారుణమైన వార్తను వినాల్సివచ్చింది. తాను ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం AI-171 అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన దుర్ఘటనలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పాయల్ కూడా ఉంది. దీనితో పాయల్ ఖాతిక్ చనిపోయిందని, DNA టెస్ట్ ద్వారా నిర్ధారించారు. ఈ విషయాన్ని పాయల్ తల్లిదండ్రులకు వెల్లడించారు.

‘కాలేజీ చదువు పూర్తి చేసిన తర్వాత, ఆమె మాతోనే ఉంది. లండన్‌ లో మరింత చదవాలనుకుంది. అందుకే, ఆమె చదువుకు అనేక రుణాలు తీసుకున్నాం…’ అని ఆమె తండ్రి సురేష్ ఖాతిక్ కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డ వల్ల మా కుటుంబ పేదరికానికి విముక్తి వస్తుందని భావించామని.. అయితే ఇప్పుడు ఇలా జరగడం దారుణమని విలపిస్తున్నారు.

Also Read : Kamal Haasan: కత్తి బహుకరించిన అభిమానిపై కమల్ హాసన్ సీరియస్

Leave A Reply

Your Email Id will not be published!