Pinnelli Ramakrishna Reddy: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్‌ మంజూరు !

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్‌ మంజూరు !

Pinnelli Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy)కి ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసుతో పాటు, పోలీసులపై దాడి కేసులో అరెస్టయిన పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్‌ జైల్లో ఉన్నారు. బెయిల్‌ మంజూరు సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. రూ.50వేల విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలి, పాస్‌పోర్టు అప్పగించాలి, ప్రతి వారం స్టేషన్‌హౌస్‌ ఆఫీసర్‌ ఎదుట సంతకం పెట్టాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేటులో ఈవీఎం ధ్వంసం, పోలీసులపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లికి ఆగస్టు-23న ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్లు దరఖాస్తు చేసిన పిన్నెల్లికి ప్రతిసారీ హైకోర్టు షాకివ్వగా… శుక్రవారం మధ్యాహ్నం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 50 వేల రూపాయలతో రెండు పూచికత్తులు సమర్పించాలని పిన్నెల్లిని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. పూచీకత్తులతో పాటు.. పాస్ పోర్టును సరెండర్ చేయాలని పిన్నెల్లిని హైకోర్టు ఆదేశించింది. ప్రతి వారం మేజిస్ట్రేట్, ఎస్‌హెచ్‌వో ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని కూడా క్లియర్ కట్‌గా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు.. పిన్నెల్లి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారు.

Pinnelli Ramakrishna Reddy – పిన్నెల్లి రిలీజ్ కు బ్రేక్ ?

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy) నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి శుక్రవారం రాత్రే విడుదల కావాల్సి ఉంది. అయితే.. పిన్నెల్లి రిలీజ్‌కు బ్రేక్ పడింది. కోర్టు నుంచి ఆర్డర్ కాపీలు స్టేషన్‌ కు చేరడం, ఇవాళ సమయం మించిపోవడంతో నిబంధనల మేరకు మాజీ ఎమ్మెల్యేను జైలు అధికారులు రిలీజ్ చేయలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు శనివారం ఉదయం లేదా మధ్యాహ్నం పిన్నెల్లి బెయిల్‌పై విడుదల అయ్యే అవకాశం ఉందని తెలియవచ్చింది. వాస్తవానికి ఇవాళ మధ్యాహ్నం హైకోర్టు కండిషన్ బెయిల్ మంజూరు చేయడంతో రాత్రికే జైలు నుంచి పిన్నెల్లి రిలీజ్ అవుతారని అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు భావించారు. ఈ క్రమంలోనే మాచర్ల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, అనుచరులు తరలివచ్చారు కూడా. ఇక పోలీసులు సైతం సెంట్రల్ జైలు వద్ద భారీగా మోహరించారు. ఇక రిలీజ్ చేయడమే ఆలస్యం అనుకుంటూ ఉండగా.. సమయం లేకపోవడంతో బ్రేక్ పడింది. దీనితో పిన్నెల్లి అభిమానులు కొందరు నిరాశతో వెనుదిరగగా.. మరికొందరు నెల్లూరులోనే ఉండిపోయారు.

ఇదిలా ఉంటే… భారీ ర్యాలీలు, మీడియాతో మాట్లాడటం ఇవన్నీ చేయకూడదని ఇప్పటికే క్లియర్ కట్‌గా పిన్నెల్లి(Pinnelli Ramakrishna Reddy)కి జైలు అధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది. అందుకే రిలీజ్ సమయంలో సెంట్రల్ జైలు దగ్గర పోలీసులు భారీగానే బందోబస్తుగా ఉన్నారు. అంతేకాదు.. గుంటూరులో కానీ, మాచర్లలో కూడా బైక్ ర్యాలీలు అంటూ హడావుడి లేకుండా ఉండాలని కూడా స్పష్టంగా పిన్నెల్లికి పోలీసులు సూచించినట్లుగా తెలియవచ్చింది. అసలే కండిషన్ బెయిల్ కావడంతో ఇందుకు తగ్గట్టుగానే రామకృష్ణారెడ్డి వ్యవహరించాల్సి ఉంది. లేని పక్షంలో మళ్లీ సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇక జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత పిన్నెల్లి ఏం చేయబోతున్నారు..? వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవబోతున్నారా..? లేదా..? అనేది తెలియట్లేదు. రామకృష్ణారెడ్డి జైలులో ఉన్నప్పుడు జగన్ ములాఖత్ అయిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. నెల్లూరు సెంట్రల్ నుంచి నేరుగా తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లి జగన్ రెడ్డిని కలుస్తారా లేకుంటే ఇంటికెళ్లొచ్చిన తర్వాత ప్రత్యేకంగా వెళ్లి కలుస్తారా..? అని అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు.

అసలేం జరిగింది ?

ఏపీ ఎన్నికలు జరిగిన మే-13న పాల్వాయి గేటు 202 పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశించిన పిన్నెల్లి.. ఈవీఎం ధ్వంసం చేశారు. ఇదేంటి..? ఎందుకిలా దౌర్జన్యం చేస్తున్నారని అడ్డుకున్న టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావుపై దాడి చేసిన ఘటనపై పిన్నెల్లిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. మరుసటి రోజు పరామర్శ పేరుతో కారంపూడిలో భారీగా అల్లర్లకు పాల్పడటమే కాకుండా విధుల్లో ఉన్న సీఐ నారాయణ స్వామిపై రాయితో దాడి చేశారు. ఈ ఉదంతంపై కేసు నమోదైంది. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనించిన రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సినిమాటిక్ రేంజ్‌లో ఛేజ్ చేసి పిన్నెల్లి(Pinnelli Ramakrishna Reddy)ని పట్టుకున్నారు. రామకృష్ణారెడ్డి పోలీసులకు దొరకగా.. ఇంతవరకూ ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి అడ్రస్ లేదు.

Also Read : Jogi Rajeev: మాజీ మంత్రి జోగి రమేశ్‌ తనయుడికి బెయిల్‌ మంజూరు !

Leave A Reply

Your Email Id will not be published!