PM Modi: తెలంగాణపై ప్రశంసల జల్లు కురిపించిన ప్రధాని మోదీ
తెలంగాణపై ప్రశంసల జల్లు కురిపించిన ప్రధాని మోదీ
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీనెలా నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆదివారం పలు అంశాలను ప్రస్తావించారు. భారతదేశాన్ని ట్రకోమా(కంటి వ్యాధి) నుండి విముక్తి పొందిన దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని ప్రధాని పేర్కొన్నారు. ఇది దేశంలోని ఆరోగ్య కార్యకర్తలు సాధించిన విజయమని, ‘జల్ జీవన్’ మిషన్ దీనికి దోహదపడిందని ప్రధాని వివరించారు.
PM Modi Appreciates
జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారని, ముఖ్యంగా తెలంగాణలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో మూడువేల మంది దివ్యాంగులు పాల్గొనడం విశేషమన్నారు. యోగా ఎంత శక్తివంతమైన సాధనంగా ఉంటుందో వారు చూపించారన్నారు. ఢిల్లీ ప్రజలు నది ఒడ్డున యోగా చేశారని, ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ వద్ద కూడా యోగా కార్యక్రమాలు జరిగాయన్నారు. న్యూయార్క్, లండన్, టోక్యో, పారిస్ తదితర ప్రాంతాల్లో యోగా వేడుకలు జరిగాయని ప్రధాని మోదీ (PM Modi) పేర్కొన్నారు.
కైలాశ్-మానసరోవర్ యాత్ర చాలా కాలం తర్వాత తిరిగి ప్రారంభమైందని, జూలై మూడు నుండి అమర్‌నాథ్ యాత్ర కూడా ప్రారంభం కానున్నదన్నారు. మరోవైపు మన దేశం ఆరోగ్య రంగంలోనూ విజయం సాధించిందని, భారత్ ట్రాకోమా రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందన్నారు. భారతదేశంలోని 64 శాతం జనాభాకు సామాజిక భద్రత అందుబాటులో ఉందంటూ అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) ఒక నివేదికను విడుదల చేసిందన్నారు. దేశంలో దాదాపు 95 కోట్ల మంది సామాజిక భద్రతా పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ (PM Modi) నాటి అత్యవసర పరిస్థితి చీకటి రోజులను కూడా గుర్తుచేసుకున్నారు. ఆనాటి సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛను రద్దు చేశారన్నారు. అయితే చివరకు వివిధ పోరాటాలతో ప్రజలు గెలిచారని, ఫలితంగా అత్యవసర పరిస్థితిని ఎత్తివేశారన్నారు. ఆ సమయంలో ధైర్యంగా ముందుకొచ్చి పోరాడిన వారిని మనం గుర్తుంచుకోవాలన్నారు. కాగా మేఘాలయకు చెందిన ఎరి సిల్క్ ఇటీవలే జీఐ ట్యాగ్‌ను పొందిందని, ఎరి సిల్క్‌ను ‘అహింసా సిల్క్’ అని కూడా పిలుస్తారన్నారు. చివరిగా ప్రధాని మోదీ భారత అంతరిక్ష మిషన్ గురించి కూడా మాట్లాడారు. వ్యోమగామి శుభాన్షు శుక్లాను అభినందించారు.
Also Read : Telangana Jagruthi: పలు దేశాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షుల నియామకం
