నిన్న తుది శ్వాస విడిచిన ప్రముఖ రాజకీయ నాయకుడు ప్రకాశ్ సింగ్ బాదల్ అంత్యక్రియలు బుధవారం పంజాబ్ లోని చండీగఢ్ లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి అంతిమ నివాళులు అర్పించేందుకు బయలు దేరి వెళ్లారు ప్రధానమంత్రి. మరణించిన ప్రకాశ్ సింగ్ బాదల్ వయసు 95 ఏళ్లు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. శ్వాస కోశ సమస్యలతో బాద పడడంతో వారం రోజుల కిందట మొహాలీ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఆయన లోకాన్ని వీడారు.
ఈ సంద్భరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రకాశ్ సింగ్ బాదల్ మరణం తీరని లోటు అని పేర్కొన్నారు. భారత దేశానికి ప్రధానంగా తనకు వ్యక్తిగతంగా నష్టమేనని పేర్కొన్నారు. గొప్ప రాజకీయ నాయకుడని బాదల్ ను కొనియాడారు.
భారత రాజకీయాలలో మేరునగ ధీరుడని కితాబు ఇచ్చారు నరేంద్ర మోదీ. దేశానికి ప్రకాశ్ సింగ్ చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. గొప్ప రాజనీతిజ్ఞుడు, పంజాబ్ పురోగతి కోసం ఎంతగానో కృషి చేశారంటూ తెలిపారు ప్రధానమంత్రి.
ప్రకాశ్ సింగ్ బాదల్ మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. నేను ఆయనతో చాలా దశాబ్దాలుగా సన్నిహితంగా మెలుగుతూ వచ్చా. ఆయన నుండి నేను చాలా నేర్చుకున్నానని తెలిపారు మోదీ.