PM Narendra Modi : బీజేపీ ప్రభుత్వాన్ని జమ్మూకశ్మీర్ ప్రజలు కోరుకుంటున్నారు

దీంతో బీజేపీ గెలుపు తథ్యమైంది'' అని మోదీ ధీమా వ్యక్తం చేశారు...

PM Narendra Modi : తొలి రెండు విడతల పోలింగ్‌ అనంతరం జమ్మూకశ్మీర్‌ లో తొలిసారి పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. అక్టోబర్ 1న తుది విడత పోలింగ్ నేపథ్యంలో శనివారంనాడిక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. ఉగ్రవాదం, అవినీతి అంశాలకు సంబంధించి కాంగ్రెస్, దాని భాగస్వామ్య పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీపై విమర్శలు గుప్పించారు. ” మొదటి రెండు విడతల పోలింగ్ సరళితో బీజేపీ తొలిసారి జమ్మూకశ్మీర్‌లో పూర్తి మెజారిటీ సాధించడం ఖాయమైంది. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. రెండు విడతల్లో ప్రజలు భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో బీజేపీ గెలుపు తథ్యమైంది” అని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అభిమతంతో తొలిసారి జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడనుందని, ఇక్కడ ఎన్నో ఆలయాలు ఉన్నాయని, ఈ అవకాశాన్ని వదులుకోవద్దని, బీజేపీ ప్రభుత్వం ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు.

PM Narendra Modi Comment

జమ్మూకశ్మీర్‌లోని కాంగ్రెస్, ఎన్‌సీ, పీడీపీల ‘మూడు కుటుంబాల’ పాలనతో ప్రజలు విసిగిపోయారని, ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని ప్రధాని అన్నారు. అవినీతి, ఉద్యోగాల్లో వివక్ష తిరిగి చోటుచేసుకోరాదని, వేర్పాటువాదం, రక్తపాతానికి ఇంకెంతమాత్రం చోటులేదని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. ” ఇక్కడి ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. తమ పిల్లలకు మంచి భవిష్యత్తును ఆశిస్తున్నాను. ఆ కారణంగానే జమ్మూకశ్మీర్ ప్రజలు బీజేపీ(BJP) పాలన రావాలని కోరుకుంటున్నారు” అని మోదీ అన్నారు. 2016 సెప్టెంబర్ 18న భారత్ చేపట్టిన సర్జికల్ దాడులను ప్రధాని గుర్తుచేస్తూ, సరిహద్దు ఉగ్రవాదంపై సర్జికల్ దాడులతో ప్రపంచానికి తాము విస్పష్టమైన సందేశం ఇచ్చామని, ఇది న్యూ ఇండియా అని, ఉగ్రవాదాన్ని సహించేది లేదని చాలా స్పష్టంగా తెలియజేశామని అన్నారు. ఉగ్రవాదులు తెగబడితే వారెక్కడున్నా మోదీ వెతికి పట్టుకుంటారనే విషయం వారికి బాగా తెలుసునన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం సర్జికల్ దాడులకు ఆధారాలు చూపెట్టమని ఆర్మీని నిలదీస్తోందని ప్రధాని విమర్శించారు. కాగా, అక్టోబర్ 1న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తుడి (మూడవ) విడత పోలింగ్ జరుగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడతాయి.

Also Read : Hassan Nasrallah : ఇజ్రాయెల్ హీజ్బుల్లా దాడుల్లో హీజ్బుల్లా చీఫ్ మృతి

Leave A Reply

Your Email Id will not be published!