PM Narendra Modi: ట్రంప్ సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ లో చేరిన ప్రధాని మోదీ
ట్రంప్ సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ లో చేరిన ప్రధాని మోదీ
PM Narendra Modi : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ ప్లాట్‌ఫామ్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేరారు. అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మాన్ నిర్వహించిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఇటీవల ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను ఆ పాడ్ కాస్ట్ లో వెల్లడించారు. తన బాల్యం, విద్యాభ్యాసం, ఆర్ఎస్ఎస్ భావజాలం, గుజరాత్ అల్లర్లు, పాకిస్తాన్ భారత్ మధ్య శాంతి స్థాపనకు చేసిన ప్రయత్నాలు ఇలా చాలా అంశాలపై ప్రధాని మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఈ పాడ్‌కాస్ట్‌ను ట్రంప్(Trump Truth) తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో వెంటనే షేర్ చేశారు. దీనితో సోమవారం మోదీ ట్రూత్ సోషల్‌లో అరంగేట్రం చేసినట్లయింది.
PM Narendra Modi – ‘ట్రూత్‌సోషల్‌లో చేరడం సంతోషంగా ఉంది – ప్రధాని మోదీ
‘ట్రూత్ సోషల్’ చేరడం సంతోషంగా ఉంది. ఇక్కడ ఉద్వేగ భరిత గొంతులతో సంభాషించడానికి, రాబోయే కాలంలో మరింత అర్థవంతమైన సంభాషణల్లో పాల్గొడానికి ఎదురు చూస్తుంటాను’ అని ప్రధాని మొదటి పోస్ట్‌లో పేర్కొన్నారు. మరో పోస్ట్‌లో.. ఫ్రిడ్మన్‌తో జరిగిన తన సంభాషణను పంచుకున్నందుకు ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు. ‘నా మిత్రుడు, అధ్యక్షుడు ట్రంప్‌కు ధన్యవాదాలు. నా జీవిత ప్రయాణం, భారతదేశ నాగరిక దృక్పథం, ప్రపంచ సమస్యలు, మరెన్నో అంశాలను నేను కవర్ చేశాను’ అని పేర్కొన్నారు.
రష్యా మూలాలున్న ఫ్రిడ్‌మాన్ అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పరిశోధకుడు. 2018 నుంచి ‘లెక్స్ ఫ్రిడ్‌మాన్’ పేరుతో పాడ్‌కాస్ట్‌లు నిర్వహిస్తున్నారు. సైన్స్, టెక్నాలజీ, స్పోర్ట్స్, రాజకీయ రంగాల్లోని ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీలతో సహా అనేక మందిని ఇంటర్వ్యూ చేశారు. ఆయనకు యూట్యూబ్‌లో 4.5 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
Also Read : Kuno National Park: పులిని చంపిన అటవీశాఖ అధికారులు! కునో నేషనల్ పార్కులో మరో చీతా విడుదల!