PM Narendra Modi : ఢిల్లీని అభివృద్ధి చేసి చూపించే బాధ్యత నాది
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పైనా ప్రధాని ఘాటు వ్యాఖ్యలు చేశారు...
Narendra Modi : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయం అభివృద్ధి, దార్శనికత, విశ్వాసానికి (వికాస్, విజన్, విశ్వాస్) దక్కిన విజయమని ప్రధాని మోదీ(Narendra Modi) అన్నారు. ఢిల్లీ అభివృద్ధికి నాది గ్యారెంటీ అని ప్రధాని హామీ ఇచ్చారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘ఇది సాధారణ విజయం కాదు. చరిత్రాత్మక విజయం. ఆప్ నుంచి ఢిల్లీకి విముక్తి లభించింది. దశాబ్దం పాటు తమను అహంకారంతో పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ రాజకీయాల నుంచి ప్రజలు తరిమికొట్టారు. వారు పాలనను మాత్రమే కోరుకుంటున్నారు, నాటకాలు ఆడటాన్ని కాదు’ అని ఆప్‌పై మోదీ మండిపడ్డారు.
PM Narendra Modi Comment
ఢిల్లీ ప్రజలు తమపై చూపించిన ప్రేమకు అనేక రెట్లు అభివృద్ధి రూపంలో తిరిగి అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఢిల్లీని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తామని పునరుద్ఘాటించారు. అన్నీ ఆలోచించే ప్రజలు డబుల్ ఇంజన్ సర్కారుకు పట్టం కట్టారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మోదీ ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పైనా ప్రధాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఢిల్లీలో జరిగిన ఆరు ఎన్నికల్లో (లోక్‌సభ, అసెంబ్లీ) దేశంలోనే అతి పురాతనమైన పార్టీ ఖాతా తెరవలేకపోయింది. సున్నా సీట్లతో డబుల్ హ్యాట్రిక్ సాధించింది. ఈ ఓటమికి గుర్తుగా వారు తమకు తామే బంగారు పతకం ఇచ్చుకుంటున్నారు. ’ అని మోదీ ఎద్దేవా చేశారు. ‘దయనీయ స్థితిలో ఉన్న బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మార్పు వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు తన ట్రాక్ రికార్డును నిరూపించుకున్నారు. ఎన్డీయే అంటే అభివృద్ధి. సుపరిపాలనకు గ్యారంటీ. పేదలకే కాకుండా మధ్యతరగతి వారికీ ప్రయోజనం చేకూరుస్తుంది’ అని ప్రధాని పేర్కొన్నారు.
Also Read : Minister Komatireddy : తెలంగాణాలో బీజేపీ ఎదుగుదలకు బీఆర్ఎస్ మూలం