PM Narendra Modi: గుజరాత్ సీఎంకు ప్రధాని మోదీ ఫోన్ ! సరిహద్దుల్లో భద్రత సన్నద్ధతపై ఆరా !
గుజరాత్ సీఎంకు ప్రధాని మోదీ ఫోన్ ! సరిహద్దుల్లో భద్రత సన్నద్ధతపై ఆరా !
PM Narendra Modi : ఆపరేషన్ సిందూర్ తో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్… ఆపరేషన్ సిందూర్ తరువాత మనపై రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. పాకిస్తాన్ సరిహాద్దుల్లో గల భారత్ గ్రామాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నిస్తోంది. అయితే పాకిస్తాన్ దాడులను భారత బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలతో సరిహాద్దు పంచుకుంటున్న పాకిస్తాన్… ఆయా రాష్ట్రాల్లో దాడులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలో సరిహాద్దు రాష్ట్రాల్లో తాజా పరిణామాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
PM Narendra Modi Call to Gujarat CM
దీనిలో భాగంగా తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi)… తన స్వంత రాష్ట్రమైన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలుపెరుగుతున్న వేళ భద్రతా సన్నద్ధతపై ఆరాతీసారు. సరిహాద్దుల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భద్రతాపరంగా సున్నిత ప్రాంతాలైన కచ్, బనస్కంతా, పటాన్, జామ్‌నగర్‌లో పౌరుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి అడిగారు. ఇవన్నీ పాక్‌తో సరిహద్దు కలిగిన ప్రాంతాలు. ప్రస్తుతం శత్రు దేశం నుంచి దాడుల ముప్పు పొంచి ఉన్న వేళ.. సరిహద్దు జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు అధికారులు ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నారు.
మరోవైపు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం కీలక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రక్షణశాఖ ఉన్నత స్థాయి భేటీ నిర్వహించగా.. ఆర్థిక, హోం, ఆరోగ్య శాఖల్లోనూ వరుస సమావేశాలు జరుగుతున్నాయి. తమ మంత్రివర్గంలోని ఉన్నతాధికారులతో ఆయా కేంద్రమంత్రులు భేటీ అయ్యారు. సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితులు, ఆర్థికపరంగా సన్నద్ధత, ఆరోగ్య సేవల అందుబాటు తదితర అంశాలపై చర్చించారు.
Also Read : Vikram Misri: ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాకిస్తాన్ సైనిక అధికారులు