Police: పోలీసు అధికారిగా తండ్రి నిర్ణయంపై హైకోర్టులో వాదించి గెలిచిన కుమార్తె
పోలీసు అధికారిగా తండ్రి నిర్ణయంపై హైకోర్టులో వాదించి గెలిచిన కుమార్తె
Police : రక్తసంబంధానికి, వృత్తిపరమైన నిబద్ధతకు మధ్య తలెత్తిన సంఘర్షణలో ఆమె వృత్తివైపే మొగ్గింది. స్వయంగా తన తండ్రి ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా బాధితుడి తరఫున వాదించి గెలిచింది. నాటకీయంగా జరిగిన ఈ ఘటనకు ఉత్తర్‌ప్రదేశ్ లోని అలహాబాద్ హైకోర్టు వేదికగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…
Police IG Daughter
2023 జనవరి 13న… పీలీభీత్‌కు చెందిన ఓ బాలిక రైలులో వెళుతుండగా లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో పోలీసు (Police) కానిస్టేబులు తౌఫిక్ అహ్మద్ పై పోక్సో కేసు నమోదైంది. దీనితో అప్పటి బరేలి రేంజ్ ఐజీ రాకేశ్‌సింగ్ (ప్రస్తుతం రిటైర్డ్) అతడ్ని సర్వీసు నుంచి తొలగించి, జైలుకు పంపారు. ఈ నిర్ణయాన్ని అహ్మద్ హైకోర్టులో సవాలు చేయగా… అతడి తరఫున సాక్షాత్తు రాకేశ్ సింగ్ కుమార్తె అనురా సింగ్ కేసును వాదించారు. విచారణ అధికారి నేరారోపణలను నిరూపించడంతోపాటు ఆయనే శిక్షను కూడా ఖరారు చేశారని, అది క్రమశిక్షణ యంత్రాంగం పనిగా కోర్టుకు తెలిపారు.
ఉత్తర్‌ప్రదేశ్ పోలీస్ సబార్డినేట్ ర్యాంకుల (శిక్ష, అప్పీలు) నిబంధనలు – 1991ని దర్యాప్తు అధికారి ఉల్లంఘించారని ఆమె ఆక్షేపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన జస్టిస్ అజిత్‌కుమార్ పాత ఉత్తర్వులను కొట్టివేశారు. అహ్మద్ ను తిరిగి విధుల్లోకి తీసుకొని, మూడు నెలల్లోపు కొత్త విచారణను పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా అనురా సింగ్ మాట్లాడుతూ… ‘‘నేను, నాన్న వృత్తిపరంగా ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించామంతే’’ అని తీర్పు అనంతరం ఆమె అన్నారు. అదే సమయంలో తన కుమార్తె వృత్తిపరమైన నిబద్ధతను చూసి గర్వపడుతున్నట్లు రాకేశ్‌సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే తన తరఫున వాదించిన న్యాయవాది ‘ఐజీ’ కుమార్తె అని చివరిదాకా తెలియదని అహ్మద్ చెప్పటం ఈ ఉదంతంలో కొసమెరుపు.
Also Read : MP KC Venugopal: విమానంలో సాంకేతిక లోపం ! ఎంపీ కేసీ వేణుగోపాల్ భావోద్వేగ పోస్ట్ !
