Balka Suman: బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసుల నోటీసులు !

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసుల నోటీసులు !

Balka Suman: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నేత, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) కు మంచిర్యాల జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేసారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు గాను విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ… హైదరాబాద్‌ లో బాల్క సుమన్‌ కు మంచిర్యాల పోలీసులు నోటీసులు అందజేశారు. వారం రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కేంద్రంలో బిఅర్ఏస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Balka Suman Case Viral

దీనిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో పాటు బాల్క సుమన్ పై పోలీసులకు పిర్యాదు చేసారు. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు… మంచిర్యాల పోలీసులు 294B, 504, 506 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. అయితే తనకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌ స్పందించారు. ప్రభుత్వం అక్రమంగా తన మీద కేసులను నమోదు చేసిందని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొన్నామని, మరోసారి ఉద్యమ బాట పట్టబోతోన్నామని అన్నారు. అంతేకాదు ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేసారు.

బాల్క సుమన్ ముఖ్యమంత్రిని ఏమన్నారంటే ?

వారం రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కేంద్రంలో బిఅర్ఏస్(BRS) పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తూ ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద పాలేరుగా అభివర్ణించారు. అంతేకాదు కేసీఆర్ జోలికి వస్తే రేవంత్ రెడ్డిని చెప్పు తీసుకుని కొడతానంటూ బాల్క సుమన్ హెచ్చరించారు. తమకు సంస్కారం అడ్డుగా వస్తోందంటూనే రేవంత్ రెడ్డీ ఖబడ్దార్ అంటూ సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం లేకపోయినా సరే… కేసీఆర్ జోలికి వస్తే తొక్కి పడేస్తాం అంటూ హెచ్చరించారు. దీనితో బాల్క సుమన్ వ్యాఖ్యలపై మంచిర్యాల కాంగ్రెస్ నాయకులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అనంతరం బాల్క సుమన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసారు.

Also Read : BJP Rajyasabha List: 14 మందితో బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా !

Leave A Reply

Your Email Id will not be published!