Pooja Khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ పై ఫోర్జరీ కేసు లో అరెస్టు !
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ పై ఫోర్జరీ కేసు లో అరెస్టు !
Pooja Khedkar: మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కఠినచర్యలకు ఉపక్రమించింది. నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి మోసానికి పాల్పడటంపై పోలీసుల ద్వారా ఫోర్జరీ కేసు నమోదు చేసింది. అంతేకాకుండా ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంతోపాటు భవిష్యత్తులో మళ్లీ నియామక పరీక్షలు రాయకుండా డిబార్ చేసేందుకు రంగం సిద్ధం చేసేలా షోకాజ్ నోటీసు ఇచ్చింది. అధికార దుర్వినియోగం, యూపీఎస్సీ(UPSC)కి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న ఆరోపణలతో పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారిన పూజా ఖేడ్కర్(Pooja Khedkar) అనుచిత ప్రవర్తనపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు యూపీఎస్సీ శుక్రవారం మధ్యాహ్నం ఓ ప్రకటనలో తెలిపింది.
అంతేకాకుండా యూపీఎస్సీ పరీక్ష నిబంధనల్ని అతిక్రమిస్తూ అవకాశాలను వాడుకొని ఆమె నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్ చేసినట్లు గుర్తించామని పేర్కొంది. తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫొటోగ్రాఫ్/సంతకం, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, చిరునామాకు సంబంధించిన పత్రాలన్నీ మార్చడం ద్వారా మోసపూరిత ప్రయత్నాలకు పాల్పడ్డారని యూపీఎస్సీ వివరించింది. షోకాజ్ నోటీసుపై పూజా ఖేడ్కర్ ఇచ్చే సమాధానం ఆధారంగా ఆమెపై తదుపరి చర్యలు ఉంటాయి. ఇప్పటికే ఆమె ప్రొబేషన్‌ను నిలిపివేసి, ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించగా.. తాజాగా అభ్యర్థిత్వాన్ని సైతం రద్దు చేస్తూ యూపీఎస్సీ నిర్ణయం తీసుకొంది.
Pooja Khedkar – ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తల్లి కూడా అరెస్టు !
వివాదాల్లో చిక్కుకున్న ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తల్లి మనోరమ ఖేడ్కర్‌ను గురువారం పుణె పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఆమెను మూడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఓ భూవివాదం వ్యవహారంలో పూజ తల్లి మనోరమ కొందరిని తుపాకీతో బెదిరించిన వీడియో వైరల్‌గా మారింది. పుణెలోని ముల్షి తహసీల్ పరిధిలోని ధద్వాలి గ్రామంలో భూవివాదం విషయంలో ఆమె తన సెక్యూరిటీ గార్డులతో కలిసి తుపాకీతో బెదిరింపులకు దిగినట్లు ఆ దృశ్యాల్లో కనిపించింది.ఈ వ్యవహారంలో ఖేడ్కర్ దంపతులతో పాటు మరో ఐదుగురిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read : Andhra Pradesh Government: ఏపీలో డ్వాక్రా మహిళలకు 5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు !