Ponguru Narayana: అమరావతిలో 4 మెగా పార్కులు – మంత్రి నారాయణ
అమరావతిలో 4 మెగా పార్కులు - మంత్రి నారాయణ
Ponguru Narayana: రాజధాని అమరావతిలో ఆహ్లాదకరమైన ఉద్యానవనాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పి.నారాయణ తెలిపారు. రాజధానికి వచ్చేవారికి ఆహ్లాదాన్ని పంచేందుకు బ్లూ, గ్రీన్ కాన్సెప్ట్ తో పర్యాటక ప్రాజెక్టులను చేపట్టే దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) సీఎండీ లక్ష్మీపార్థసారథి భాస్కర్… ఏడీసీ అభివృద్ధి చేసిన వెంకటపాలెం నర్సరీ, శాఖమూరు సెంట్రల్ పార్కులను పరిశీలించారు. మంత్రి నారాయణ(Ponguru Narayana) మీడియాతో మాట్లాడారు. రాజధానిలో 4 పెద్ద పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రానున్న ఆరు నెలల్లో వీటిని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. శాఖమూరులో 300 ఎకరాల్లో సెంట్రల్ పార్కును అభివృద్ధి చేస్తున్నామన్నారు. నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్(లండన్), సింగపూర్‌కు చెందిన నిష్ణాతులతో అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నారు.
Ponguru Narayana Comment
ఈ సందర్భంగా మంత్రి నారాయణ(Ponguru Narayana) మాట్లాడుతూ… ‘అమరావతిలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో బ్లూ అండ్ గ్రీన్ మాస్టర్ ప్లాన్‌ను తయారు చేశాం. హైదరాబాద్ మహానగరాన్ని పచ్చదనంతో అద్భుతంగా తీర్చిదిద్దిన సీనియర్ అధికారికి ఈ ప్రాజెక్టుల అభివృద్ధి బాధ్యతలను అప్పగించాం. శాఖమూరు, అనంతవరం, నీరుకొండ ప్రాంతాల్లో సుందరమైన రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి పర్యాటక కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతాం. శాఖమూరు సెంట్రల్ పార్కులో బోటింగ్‌కు అనువుగా 50 ఎకరాల్లో రిజర్వాయర్‌ను నిర్మించి పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నీరుకొండలో 500 ఎకరాల్లో వాటర్ లేక్స్ ఏర్పాటుకు సన్నద్ధం చేస్తు న్నాం.
కొండవీటివాగు, పాలవాగు గ్రావిటీ కెనాల్ వంటి నీటి ప్రాజెక్టుల వెం బడి 20, 30 మీటర్ల వెడల్పుతో బఫర్ జోన్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అనంతవరంలో 35 ఎకరాల్లో ఉద్యానవనం, రాష్ట్ర సచివాలయం ముందు 21 ఎకరాల్లో మల్కాపురం పార్కులను ఏర్పాటు చేసి వీటిలో విభిన్న రకాల మెడిసిన్ ప్లాంట్లను పెంచుతున్నాం అని వివరించారు. అమరావతిలో ఏడీసీ ఆధ్వర్యంలో 360 కిలోమీటర్ల మేర సువిశాలమైన రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. రూ.41 వేల కోట్ల వ్యయంతో ముఖ్యమైన మౌలిక వసతులైన వాటర్ లైన్లు, ఐసీటీ, విద్యుత్, గ్యాస్, వాటర్ డ్రెయిన్లు, నీటిపారుదల వ్యవస్థల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ. 5,100 కోట్లు ఖర్చుచేశామని.. వైసీపీ హయాంలో అమరావతి ముళ్లకంపతో నిండిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ముళ్ల కంపలను తొలగించడానికి రూ.36.50 కోట్ల వ్యయం తో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నిలిచిపోయిన రాజధాని ప్రాజెక్టుల స్థితిగతులపై మద్రాస్ ఐఐటీ, హైదరాబాద్ ఐఐటీ బృందాలు ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పర్యటించాయని.. నిర్మాణాల నాణ్యతకు సంబంధించి సెప్టెంబరు మొదటి వారంలో నివేదిక ఇస్తాయని చెప్పారు.
Also Read : Monkeypox: ఏపీ మెడ్ టెక్ జోన్ ఘనత ! మంకీపాక్స్ నిర్ధారణ కిట్ తయారీ !