Prashant Kishor: నీతీశ్ కుమార్ కూటమి మారడం ఖాయం- ప్రశాంత్ కిషోర్
నీతీశ్ కుమార్ కూటమి మారడం ఖాయం- ప్రశాంత్ కిషోర్
Prashant Kishor : రాజకీయ పార్టీల ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ప్రశాంత్ కిషోర్… ప్రస్తుతం ఆ బాధ్యతల నుండి తప్పుకున్నప్పటికీ… ప్రభుత్వాల మార్పుపై మాత్రం సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ఏపీలో వైసీపీ భారీ ఓటమి చవిచూస్తుందని తేల్చి చెప్పారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోనికి రావడంలో కీలకంగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేయడంపై వైసీపీ నేతలు తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. అయితే పీకె చెప్పినట్లు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్(Nitish Kumar) ను ఉద్దేశ్యించి సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత నీతీశ్ కుమార్ కూటమి మారతారంటూ బల్లగుద్ది చెప్పారు. సీఎం పదవి మరోసారి చేపట్టేందుకు ఆయన ఈ మార్గాన్ని ఎంచుకోవడం ఖాయమని పీకే అన్నారు.
Prashant Kishor Shocking Comments
బిహార్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) మాట్లాడుతూ… ‘‘బిహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి నీతీశ్ కుమార్ పోటీ చేస్తారు. అయితే… ఆయన కాకుండా మరెవరైనా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ, ముఖ్యమంత్రి పదవిపై ఆశతో ఆయన కూటమి మారే ప్రయత్నం చేయవచ్చు. నీతీశ్ ఏ కూటమిలో ఉన్నా సరే… మరోసారి ఆయన సీఎంగా కొనసాగేందుకు ప్రజలు అంగీకరించరు. జేడీ(యూ) అధినేత పార్టీ మారడం ఖాయం. ఇది కచ్చితంగా జరుగుతుందని రాసి ఇస్తా. ఒకవేళ నేను చెప్పింది జరగపోయినట్లయితే… రాజకీయ ప్రచారం నుంచి తప్పుకుంటా’’ అని పీకే పేర్కొన్నారు.
సీఎం అభ్యర్థిగా నీతీశ్ కుమార్‌ను ప్రకటించేందుకు బీజేపీ ఆసక్తి చూపడం లేదంటూ వస్తున్న ఊహాగానాలపై పీకే మాట్లాడారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నీతీశ్ ను ప్రకటించాలంటూ ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు. ఒకవేళ అలా చేస్తే ఆ పార్టీ సీట్లు గెలవడం కష్టమవుతుందన్నారు. ‘‘జేడీ(యూ) ఎక్కువ సీట్లు గెలుచుకోలేకపోవచ్చు. నీతీశ్ చేతిలో సీఎం పదవిని పెట్టేందుకు కాషాయ పార్టీ నిరాకరించినప్పుడు ఆయన కూటమి మారేందుకు ప్రయత్నించవచ్చు. అయితే.. ఆయన ఎక్కడ ఉన్నా సరే ఉన్నత పదవి మాత్రం దక్కదు’’ అని అన్నారు.
Also Read : YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్ రంగన్న మృతి