Priyanka Gandhi: మలయాళం నేర్చుకుంటున్న ప్రియాంక గాంధీ
మలయాళం నేర్చుకుంటున్న ప్రియాంక గాంధీ
Priyanka Gandhi : కేరళ మాజీ సీఎం ఏకే ఆంటోనీ సూచన మేరకు తాను మలయాళం నేర్చుకుంటున్నానని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) పేర్కొన్నారు. వయనాడ్ ఎన్నికల ప్రచారం సమయంలో మాజీ సీఎం ఏకే ఆంటోనీ తనకు ఓ సూచన చేశారని అన్నారు. వయనాడ్ ప్రజలకు దగ్గరవ్వాలన్నా… వారి కష్టాలు తెలుసుకోవాలన్నా… అక్కడి ప్రజల మాతృభాష నేర్చుకోవాలని ఆయన చెప్పారన్నారు. నాటి నుంచి ఓ టీచర్ ను పెట్టుకొని మరీ తాను మలయాళం నేర్చుకుంటున్నానని… ప్రస్తుతం కొంత వరకు మాట్లాడగలుగుతున్నానని తెలిపారు.
Priyanka Gandhi Learning
వయనాడ్ లోని వడక్కనాడ్ ప్రాంతంలోని ఓ గిరిజన తండాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని, ప్రసంగించారు. తన నానమ్మ, దివంగత ప్రధాని ఇందిరా గాంధీకి గిరిజన సమాజం పట్ల ఎంతో గౌరవం ఉండేదని గుర్తు చేసుకున్నారు. గిరిజనలు పాటించే సామరస్య జీవన విధానం, అడవికి ఇచ్చే గౌరవం గురించి ఆమె తరచూ తమకు చెప్పేవారన్నారు. గిరిజనులను కలిసినప్పుడు వారు ఏదైనా బహుమతి ఇస్తే… దాన్ని ఎంతో జాగ్రత్తగా ఆమె దాచుకునే వారని చెప్పారు. ప్రస్తుతం మ్యూజియంగా ఉన్న ఆమె ఇంటిని సందర్శిస్తే నేటికీ అటువంటి ఎన్నో వస్తువులను అక్కడ చూడొచ్చని పేర్కొన్నారు.
వయనాడ్ ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న తాగునీరు, రోడ్డు సమస్యలను పరిష్కరించడానికి నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని ప్రియాంక అన్నారు. ఈ సమస్యలపై మరోసారి సంబంధిత మంత్రులను కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 2024 డిసెంబర్‌లో లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వయనాడ్ నుంచి ఆమె భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
Also Read : TVK Chief Vijay: 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై టీవీకే అధినేత విజయ్ కీలక వ్యాఖ్యలు