Priyanka Gandhi: కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై నాకు ఆశ్చర్యం లేదు – ప్రియాంక గాంధీ

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై నాకు ఆశ్చర్యం లేదు - ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: సుమారు 50 ఏళ్ళ క్రితం దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పరిపాలనలో దేశంలో ఎమర్జెన్సీని విధించిన జూన్‌ 25ను ఇకపై ఏటా ‘రాజ్యాంగ హత్యాదినం’ (సంవిధాన్‌ హత్యాదివస్‌)గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. మోదీ సర్కార్‌ తీసుకున్న చర్యలపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చి ప్రతికూల రాజకీయాలకు పాల్పడేవారు ఇలా చేయడంలో వింతేమీ లేదని అని విమర్శలు గుప్పించారు.

Priyanka Gandhi Comment

‘‘దేశంలోని గొప్ప వ్యక్తులు కలిసికట్టుగా స్వాతంత్య్రాన్ని మాత్రమే కాకుండా రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారు. కానీ, కేంద్రంలోని మోదీ సర్కార్‌ ఎప్పటి నుంచో రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తోంది. దాన్ని రద్దు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రతికూల రాజకీయాలకు పాల్పడేవారు ‘సంవిధాన్‌ హత్యాదివస్‌’ ప్రకటించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. రాజ్యాంగంపై విశ్వాసం ఉన్నవారు మాత్రమే పరిరక్షణ కోసం పోరాడుతున్నారు’’ అని ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) పేర్కొన్నారు.

నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 1975 జూన్‌ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. ఆమె ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారని… కారణం లేకుండా లక్షలాది మందిని జైల్లో పెట్టారని ఎన్డీయే సర్కార్‌ గుర్తు చేసింది. ఆ చీకటి రోజులకు నిరసనగా ఇక నుంచి ఏటా జూన్‌ 25ను ‘సంవిధాన్‌ హత్యాదివస్‌’గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. దీనిపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదంతా ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరుగుతున్న మరో కపట ప్రచార ఎత్తుగడ అని పేర్కొంది.

Also Read : Gajendra singh Shekhawat: 56 ఏళ్ల వయసులో స్కై డైవింగ్ చేసిన కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ !

Leave A Reply

Your Email Id will not be published!