Minta Devi 124: ‘124 ఏళ్ల మింతా దేవి’ టీషర్ట్‌తో విపక్ష ఎంపీల నిరసన

‘124 ఏళ్ల మింతా దేవి’ టీషర్ట్‌తో విపక్ష ఎంపీల నిరసన

Minta Devi 124: బిహార్‌ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను (ఎస్‌ఐఆర్‌) వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌, ఆర్జేడీ వంటి విపక్ష పార్టీలు సోమవారం దిల్లీలో నిరసన ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. మంగళవారం కూడా విపక్షాలు తమ నిరసనను కొనసాగించాయి. ఆందోళనల్లో భాగంగా కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీతో సహా పలువురు ప్రతిపక్ష నేతలు ‘మింతా దేవి’ అనే బిహార్‌ ఓటరు ఫొటోతో ఉన్న టీ షర్టులు ధరించి పార్లమెంటు వెలుపల నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ఇతర ప్రతిపక్ష ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బీహార్ కు చెందిన 124 ఏళ్ల వృద్ధ మహిళ మింతా దేవి (Minta Devi 124) పేరు ఓటరు జాబితాలో కనిపించడంతో… ఇండియా కూటమి నేతలు మింతా దేవి ఫొటో ఉన్న టీ షర్టులు, వాటిపై 124 నాటౌట్ అని రాసి ఉన్న వాటిని ధరించి నిరసనలో పాల్గొన్నారు.

Minta Devi 124 Viral

ఇటీవల బీహార్‌లో విడుదలైన ఓటరు ముసాయిదా జాబితాలో, మింతా దేవి అనే మహిళ వయస్సు 124 సంవత్సరాలు అని నమోదైంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక వయస్సు కలిగిన వ్యక్తి వయస్సుకంటే ఎక్కువగా ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల తన ప్రజెంటేషన్‌లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇది నకిలీ జాబితా. ఎన్నో తప్పులు, అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆధారంగా చేసుకుని, ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్‌, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.

ఆగస్టు 12న పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi), కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, టీఎంసీకి చెందిన డెరెక్ ఓ బ్రెయిన్, డీఎంకేకు చెందిన టీఆర్ బాలూ, ఎన్సీపీ నేత సుప్రియా సులే వంటి కీలక నేతలంతా ఈ టీ-షర్టులు ధరించారు. ఈ టీ-షర్ట్ వెనుక భాగంలో 124 నాటౌట్ అని రాసి ఉంది. ఇది చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వినూత్న నిరసనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బీహార్‌లో ఓటరు జాబితాలో జరిగిన మోసాలపై ప్రతిపక్షాలు గళం విప్పాయి. SIR ప్రక్రియలో తప్పులు, నకిలీ ఓటర్లు, మరీ ముఖ్యంగా 124 ఏళ్ల మింతా దేవి లాంటి వివరాలు ఆ జాబితాలో ఉండటం వారి ఆగ్రహానికి కారణమైంది. ఈ నిరసన ద్వారా ప్రతిపక్ష నాయకులు ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నిస్తూ, ఈ మోసాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 124 నాటౌట్ అనే స్లోగన్ ద్వారా వారు ఈ అంశాన్ని సీరియస్‌గా ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఈ టీ-షర్టులు కేవలం నిరసన సాధనం మాత్రమే కాదని, ఈ సమస్య తీవ్రత గురించి చెప్పడమే ఉద్దేశమని అంటున్నారు.

Also Read : Justice Yashwant Varma: జస్టిస్‌ వర్మపై అభిశంసన తీర్మానాన్ని స్వీకరించిన స్పీకర్‌

Leave A Reply

Your Email Id will not be published!