Puja Khedkar: డ్రైవర్ కిడ్నాప్ కేసులో తెరపైకి పూజా ఖేడ్కర్ పేరు
డ్రైవర్ కిడ్నాప్ కేసులో తెరపైకి పూజా ఖేడ్కర్ పేరు
Puja Khedkar : యూపీఎస్సీకి తప్పుడు పత్రాలు సమర్పించి ఐఏఎస్ ఉద్యోగం కోల్పోయిన పూజా ఖేడ్కర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ ట్రక్కు డ్రైవర్ ను కిడ్నాప్ చేసిన కేసులో ఆమె పేరు మళ్లీ బయటకు వచ్చింది. నవీ ముంబయిలోని ఎరోలీ సిగ్నల్ వద్ద కాంక్రీట్ మిక్సర్ ట్రక్, కారు ఢీకొన్నాయి. ఆ సమయంలో ప్రహ్లాద్ కుమార్ అనే డ్రైవర్ ట్రక్కును నడిపాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ప్రహ్లాద్‌ను ఇద్దరు వ్యక్తులు బలవంతంగా కారులో తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. విచారణ చేపట్టగా డ్రైవర్ పుణెలోని చతుశృంగి ప్రాంతంలో ఉన్నట్లు తేలిందని వెల్లడించారు. అతడి కోసం పూజా ఖేడ్కర్ (Puja Khedkar) ఇంటికి వెళ్లగా… ఆమె తల్లి నుంచి తమకు ప్రతిఘటన ఎదురైందని పేర్కొన్నారు. మనోరమ ఖేడ్కర్ తమ విధులకు ఆటంకం కలిగించిందన్నారు. ఇంటి తలుపులు తెరవలేదని ఆరోపించారు. దీంతో ఆమెకు సమన్లు జారీ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు రావాలని కోరారు.
Puja Khedkar – Driver Kidnap Case
పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పూజా ఖేడ్కర్ (Puja Khedkar) పై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ… ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్ చేసినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని ఆమెకు షోకాజ్ నోటీసులిచ్చింది.
తనపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తాను ఏ పత్రాలను ఫోర్జరీ చేయలేదని తెలిపారు. యూపీఎస్సీకి తనపై అనర్హత వేటు వేసే అధికారం లేదని వాదించినప్పటికీ.. ఆమెకు నిరాశే ఎదురైంది. గతేడాది ఆగస్టులో ఆమె ముందస్తు బెయిల్‌కు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆమెకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ వచ్చింది. ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Also Read : Suresh Gopi: ఆ పెద్దాయన అప్లికేషన్ అందుకే తీసుకోలేదు – కేంద్ర మంత్రి సురేశ్ గోపి
