Puja Khedkar: డ్రైవర్ కిడ్నాప్ వ్యవహారంలో పరారీలో పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు
డ్రైవర్ కిడ్నాప్ వ్యవహారంలో పరారీలో పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు
Puja Khedkar : నవీ ముంబయిలో ట్రక్కు డ్రైవర్ కిడ్నాప్ కేసు మరో మలుపు తిరిగింది. అతడిని కిడ్నాప్ చేసింది మాజీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తండ్రి దిలీప్ ఖేడ్కర్ అని తేలింది. ఆ డ్రైవర్‌ను పోలీసులు రక్షించే ప్రయత్నం చేయగా… దిలీప్ భార్య మనోరమ ఖేడ్కర్ (Puja Khedkar) పోలీసుల పైకి కుక్కలను ఉసిగొల్పారు. దీనితో దంపతులు ఇద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సెప్టెంబర్ 13న దిలీప్ ఖేడ్కర్ ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదం తర్వాత దిలీప్, ఆయన బాడీగార్డు ప్రఫుల్ల, ట్రక్కు డ్రైవర్ ప్రహ్లాద్‌తో వాగ్వాదానికి దిగారు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తామనే నెపంతో అతడిని 150 కిలోమీటర్ల దూరంలోని పుణెకు తీసుకెళ్లారు.
Puja Khedkar Family
తనను బలవంతంగా పుణెకు తీసుకెళ్తున్నారనే విషయాన్ని ట్రక్కు డ్రైవర్ యజమానికి ఫోన్‌లో తెలియజేశాడు. దీనితో ట్రక్కు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు వాహనం నంబర్ ఆధారంగా పుణెలోని ఖేడ్కర్ నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో పూజా ఖేడ్కర్ (Puja Khedkar) తల్లి మనోరమ ఖేడ్కర్ వారిని అడ్డుకుంది. గేటు తెరవడానికి నిరాకరించింది. పోలీసు అధికారులను దూషించడమే కాకుండా.. వారిపైకి కుక్కలను ఉసిగొల్పింది. చివరికి పోలీసులు లోపలికి ప్రవేశించగా.. కిడ్నాప్‌నకు ఉపయోగించిన కారు వారి ఇంటి పరిసరాల్లోనే ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆధారాలను ధ్వంసం చేయడం సహా విధులకు ఆటంకం కలిగించారని మనోరమపై కేసు నమోదు చేశారు. డ్రైవర్‌ను రక్షించారు.
పూజా ఖేడ్కర్ కుటుంబసభ్యుల తీరు వివాదాస్పదం కావడం ఇదేమీ తొలిసారి కాదు. తప్పుడు ఓబీసీ, దివ్యాంగ పత్రాలు సమర్పించి పూజా ఖేడ్కర్ యూపీఎస్సీలో ఉద్యోగం పొందారు. తోటి అధికారితో గొడవ పడగా.. ఆ వివాదం కాస్తా ఆమె ధ్రువపత్రాల విచారణకు దారితీసింది. దీంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. మనోరమ ఖేడ్కర్ కూడా గతంలో ఓ రైతుకు తుపాకీ చూపిస్తూ బెదిరిస్తున్న వీడియో వైరల్ అయ్యింది. దాంతో కుటుంబం మొత్తంపై దాడి, బెదిరింపు కేసులు నమోదయ్యాయి. తాజాగా దిలీప్ ఖేడ్కర్‌పై కిడ్నాప్ కేసు నమోదుకావడంతో దంపతులిద్దరూ అదృశ్యమయ్యారు.
Also Read : Nupur Bora: అస్సాం మహిళా అధికారి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు
