QS Rankings: యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో ప్రపంచ ఉత్తమ నగరంగా సియోల్
యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో ప్రపంచ ఉత్తమ నగరంగా సియోల్
QS Rankings : ఉన్నత విద్య కోసం అనేక మంది విదేశాల బాటపడుతుంటారు. ఇందులో భాగంగా యూనివర్సిటీల వివరాలతోపాటు జీవన వ్యయం, ఉపాధి అవకాశాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు చదువుకునేందుకు, నివసించేందుకు అనుకూలంగా ఉన్న ఉత్తమ నగరాల జాబితాను లండన్‌కు చెందిన క్యూఎస్ సంస్థ (QS Rankings) విడుదల చేసింది. విద్యార్థులకు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్ నిలిచింది. గత ఆరేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న లండన్ ఈసారి మూడో ర్యాంకుకు పరిమితమైంది.
QS Rankings Update
ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో యూనివర్సిటీ ర్యాంకింగ్స్, ఉపాధి అవకాశాలు, జీవన వ్యయం, విద్యార్థుల అభిప్రాయాలు తదితర అంశాలను లెక్కలోకి తీసుకుని క్యూఎస్ సంస్థ ఈ జాబితాను రూపొందించింది. టాప్-130 నగరాల్లో భారత్‌లోని ముంబయి (98), దిల్లీ (104), బెంగళూరు (108), చెన్నై (128)లకు చోటుదక్కింది. అందుబాటు జీవన వ్యయం కేటగిరీలో దిల్లీ టాప్‌లో నిలిచింది. ముంబయి, బెంగళూరులు టాప్-15లో ఉన్నాయి. గత జాబితాతో పోలిస్తే ముంబయి 15 స్థానాలు మెరుగుపర్చుకుని టాప్-100లో నిలిచింది. బెంగళూరు 22, చెన్నై 12, దిల్లీ ఏడు స్థానాలు ఎగబాకాయి.
ఉపాధి అవకాశాల కేటగిరీలో దిల్లీ, ముంబయి టాప్-50లో చోటుదక్కించుకున్నాయి. బెంగళూరు 41 స్థానాలు ఎగబాకి 59వ స్థానంలో నిలిచింది. వరుసగా ఆరేళ్లపాటు మొదటిస్థానంలో నిలిచిన లండన్‌ను అధిక జీవన వ్యయం అంశం దెబ్బతీసింది. ఈ కేటగిరీలో ఏకంగా 137వ స్థానానికి పడిపోయింది. బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్స్‌లో పెరుగుతున్న భారత్ ఉనికి… ఆ దేశ ఉన్నత విద్యారంగంలో చోటుచేసుకుంటున్న నిర్మాణాత్మక మార్పులను ప్రతిబింబిస్తోందని ‘క్యూఎస్’ సీఈవో జెస్సికా టర్నర్ తెలిపారు. జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) 2020 సత్ఫలితాలు ఇస్తోందని పేర్కొన్నారు.
Also Read : AP High Court: వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పై హైకోర్ట్ సీరియస్
