Raghuram Rajan: ట్రంప్ టారిఫ్‌లపై ఆర్బీఐ మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
ట్రంప్ టారిఫ్‌లపై ఆర్బీఐ మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
Raghuram Rajan : భారత్‌పై అమెరికా విధించిన అదనపు టారిఫ్‌లు కేవలం ట్రేడ్ టూల్ మాత్రమే కాదని రిజర్వ్ బ్యాంక్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ (Raghuram Rajan) అన్నారు. రాజకీయ, ఆర్థిక శక్తిగా ఎదిగేందుకే ట్రంప్ ఈ సుంకాల భారం మోపుతున్నారని అభిప్రాయపడ్డారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన టారిఫ్‌ల అంశంపై స్పందించారు.
Raghuram Rajan Key Comments
‘‘టారిఫ్‌ల భారం భారత్‌కు ఓ మేలుకొలుపు లాంటిది. ఏ దేశంపైనా విస్తృతంగా ఆధారపడకూడదు. యూఎస్‌తో వాణిజ్యం కొనసాగిస్తూనే ఐరోపా, ఆఫ్రికా వంటి దేశాలపైనా దృష్టి సారించాలి. ఈ రోజుల్లో వాణిజ్యం, పెట్టబడులు, ఆర్థిక అవసరాలు యుద్ధానికి ఆయుధాలుగా మారుతున్నాయి. వీటిపట్ల న్యూదిల్లీ జాగ్రత్తగా వ్యవహరించాలి. వృద్ధికి ఊతమిచ్చే, యువతకు ఉపాధి కల్పించే సంస్కరణలను తీసుకురావాలి’’ అని సూచించారు.
ట్రంప్ (Trump) టారిఫ్‌లు విధించేందుకు అనేక కారణాలు ఉన్నాయని రాజన్ అన్నారు. ‘‘కరెంటు ఖాతా లోటు, ద్రవ్య లోటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అమెరికాను ఇతర దేశాలు వాడుకుంటున్నాయని ట్రంప్ (Trump) భావిస్తున్నారు. కానీ, చౌక ధరకు వస్తువులను దిగుమతి చేసుకుంటున్నందుకు అమెరికా వినియోగదారులే ప్రయోజనం పొందుతున్నారన్న విషయాన్ని మర్చిపోయారేమో. ఇక, ఈ సుంకాలను ఆయన ఇతర దేశాలపై పన్నులుగా పరిగణిస్తున్నారు. తద్వారా అమెరికాకు ఆదాయం సమకూరుతుందని ఆలోచిస్తున్నారు. అయితే, దీని వల్ల సొంత ప్రజలకే నష్టం జరుగుతుందన్న విషయాన్ని గుర్తించట్లేదు. సైనిక శక్తిని ఉపయోగించలేని సందర్భాల్లో టారిఫ్‌లను తమ బలప్రయోగం కోసం ట్రంప్ వినియోగించుకుంటున్నారు’’ అని రాజన్ పేర్కొన్నారు.
విదేశీ విద్యార్థులపై ట్రంప్ మరో పిడుగు
అమెరికాలో చదువుల కోసం ప్రయత్నిస్తున్న, అగ్రరాజ్యంలో ఉంటున్న విదేశీ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఇప్పటికే వీసాల జారీకి ‘సోషల్ మీడియా వెట్టింగ్’ను కఠినంగా అమలుచేస్తోన్న అగ్రరాజ్యం… తాజాగా విద్యార్థుల వీసా నిబంధనల్లో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఫలితంగా ఇకపై విదేశీ విద్యార్థులు నాలుగేళ్లకు మించి అమెరికాలో ఉండకుండా వీసా నిబంధనల్లో మార్పులు చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
1978 నుండి అందుబాటులో ఉన్న ఎఫ్-1 వీసా ఉన్న విద్యార్థులు “డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్” ఆధారంగా అమెరికాలో ఉండే అవకాశం ఉండేది. అంటే వారు పూర్తి కాలం చదువుతున్నంత కాలం ఉండొచ్చు. అంటే ఒక కోర్స్ పూర్తయిన మరో కోర్సులో చేరి అక్కడే ఉండొచ్చు. కానీ కొత్త ప్రతిపాదనల ప్రకారం.. విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసిన తర్వాత వారి సొంత దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం గరిష్టంగా నాలుగేళ్ల గడువు విధించింది. ఒకవేళ నాలుగేళ్ల తర్వాత కూడా అమెరికాలో ఉండాలనుకుంటే విద్యార్థులు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) ద్వారా పునఃపరిశీలన కోసం దరఖాస్తు చేయాలి.
ఎఫ్-1 విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్న తర్వాత మరో వీసా కోసం ప్రయత్నించాలనుకుంటే.. ఆ గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 30 రోజులకు కుదించారు.ఈ మార్పులు అమల్లోకి వస్తే భారతీయ విద్యార్థులపై అధిక ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 3.3 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికా వర్సిటీల్లో చదువుకుంటున్నారు.
Also Read : Google: విశాఖలో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్
