Rahul Gandhi: రేవంత్ సర్కార్‌పై రాహుల్ గాంధీ ప్రశంసల జల్లు

రేవంత్ సర్కార్‌పై రాహుల్ గాంధీ ప్రశంసల జల్లు

Rahul Gandhi : తెలంగాణాలోని రేవంత్ రెడ్డి సర్కార్‌ పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణలో కుల గణనను ప్రభుత్వం స్ఫూర్తిదాయకంగా నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. గురువారం న్యూఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరా భవన్‌లో తెలంగాణలో కుల గణన సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడుతూ… తెలంగాణలో కుల గణన సర్వే చేపట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.

55 ప్రశ్నలతో క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఈ కుల గణన చేపట్టారని రాహుల్‌ వివరించారు. విజయవంతంగా కుల గణన నిర్వహించడమంటే అంత ఈజీ కాదన్నారు. రేవంత్‌ (CM Revanth Reddy) సహా కాంగ్రెస్‌ పార్టీ నేతలు అంచనాలకు మించి రాణించారని కితాబు ఇచ్చారు. దేశంలో సామాజిక న్యాయానికి ఇదో మైలురాయిగా నిలుస్తుందని రాహుల్‌ అభివర్ణించారు. దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు.

Rahul Gandhi –  తెలంగాణలో ఉన్నంత డేటా ఏ రాష్ట్రంలోనూ లేదు – రాహుల్‌ గాంధీ

‘‘ఆఫీస్‌ రూముల్లో కూర్చుని కులగణన చేస్తే మంచి ఫలితాలు రావు. తెలంగాణ కులగణనలో దాదాపు 56 ప్రశ్నలు అడిగారు. సరైన డేటా ఉంటే ఏదైనా చేయగలం. ఇప్పుడు ఆ రాష్ట్రం చేతిలో సరైన డేటా ఉంది. భారత్‌లో తెలంగాణకు ఉన్న స్థాయిలో డేటా మరే రాష్ట్రంలోనూ లేదు. దేశంలో కులగణన నిర్వహణకు ఇది మార్గదర్శిగా నిలుస్తుంది. అయితే కేంద్రంలోని బీజేపీ సర్కారు సరైన రీతిలో దీన్ని చేయదు. దేశ అసలైన వాస్తవ చిత్రాన్ని బహిర్గతం చేయడానికి ఆ పార్టీ ఇష్టపడదు.

88 కోట్ల పేజీల్లో కులగణన సర్వే డేటా – సీఎం రేవంత్‌రెడ్డి

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ఇప్పటివరకు కులగణన జరగలేదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ప్రకటించారని గుర్తుచేశారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కులగణన సర్వే చేసిందని చెప్పారు. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేపై దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ ఎంపీలు, నేతలకు సీఎం ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో కులగణన సర్వే ప్రక్రియను 2024లో మేం ప్రారంభించాం. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, కుల, రాజకీయ సర్వే సమగ్రంగా జరిగింది. ఇది 88 కోట్ల పేజీల్లో నిక్షిప్తమైంది. ప్రధాని మోదీకి బీసీలపై నిజమైన ప్రేమ లేదు. కొన్ని విషయాల్లో మోదీ సర్కార్‌ దిగివచ్చేలా రాహుల్‌గాంధీ పోరాటం చేశారు. ఆయన పోరాడినందువల్లే మూడు రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కులగణన చేసేందుకు కూడా దిగి వచ్చింది’’ అని అన్నారు.

అంతకుముందు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే ఇవాళ దేశానికి దిక్సూచిగా మారిందని అన్నారు. రాహుల్‌ గాంధీ హామీ మేరకు రాష్ట్రం అధికారంలోకి రాగానే కులగణన చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి 150 ఇళ్లను ఒక బ్లాక్‌గా విభజించి సమగ్రమైన సర్వే నిర్వహించినట్లు వివరించారు. కాంగ్రెస్‌ ఒత్తిడితో దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు కేంద్రం దిగి వచ్చిందని తెలిపారు.

Also Read : Pakistani Drones: పాకిస్తాన్ డ్రోన్ల దాడిని తిప్పికొట్టిన భారత భద్రతా బలగాలు

Leave A Reply

Your Email Id will not be published!