Amaravathi Railway Line: రూ.2,047 కోట్లతో ఏపీ రాజధాని అమరావతికి రైల్వే లైన్ !
రూ.2,047 కోట్లతో ఏపీ రాజధాని అమరావతికి రైల్వే లైన్ !
Amaravathi Railway Line: సాధారణ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మురిపించిన కేంద్ర ప్రభుత్వం తాజా రైల్వే బడ్జెట్ లో కూడా ఏపీకు వరాల జల్లు కురిపించింది. ఏపీ రాజధాని అమరావతి(Amaravathi)ని అనుసంధానిస్తూ రూ.2,047 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం ఓకే చెప్పింది. అంతేకాదు రాష్ట్రానికి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన పలు రైల్వే ప్రాజెక్టులను కూడా మంజూరు చేసింది. రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ 56 కిలోమీటర్ల పరిధిలో రూ.2,047 కోట్లతో కొత్త రైల్వే ప్రాజెక్టును చేపడుతున్నామని, ఇది డీపీఆర్ దశలో ఉన్నదని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. నీతీఆయోగ్ కూడా దీనిని అనుమతించిందని తెలిపారు. అమరావతి రైల్వే లైన్(Amaravathi Railway Line) మ్యాప్‌ను ఆయన విలేకరులకు చూపించారు. విజయవాడ-ఏరుపాలెం నుంచి కొండపల్లి రిజర్వు ఫారెస్టు ద్వారా కృష్ణానదిని దాటి అమరావతి స్టేషన్‌కు, అక్కడి నుంచి నంబూరుకు ఈ లైను చేరుకుంటుందని తెలిపారు.
Amaravathi Railway Line…
ఈ సందర్భంగా ఏపీలో రైల్వేల మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రాజెక్టులకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.9,151 కోట్లను కేటాయించామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009-14 మధ్య ఐదేళ్లకు సగటున రూ. 886 కోట్లు కేటాయించగా, తాము ఈ ఒక్క ఏడాదే విభజిత ఆంధ్రప్రదేశ్‌కు అంతకు పది రెట్లకు పైగా నిధులు కేటాయించామని ఆయన వివరించారు. ఏపీలో మొత్తం రైల్వే విద్యుదీకరణ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ప్రస్తుతం రూ.73,743 కోట్ల వ్యయంతో 5,329 కిలోమీటర్ల మేరకు కొత్త లైన్లకు సంబంధించి 41 ప్రాజెక్టులు అమలవుతున్నాయని ఆయన తెలిపారు.
ఏపీలో 2009-14 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 73 కొత్త రైల్వే లైన్ల నిర్మాణం జరగగా, తాము పదేళ్లలో విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 151 కొత్త రైల్వే లైన్లను నిర్మించామన్నారు. అదే విధంగా యూపీఏ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేవలం 37 రైల్వే లైన్ల విద్యుదీకరణ జరిగితే, తాము గత పదేళ్లలో 195 లైన్ల విద్యుదీకరణ జరిపామని ఆయన చెప్పారు. ఏపీలో రికార్డు స్థాయిలో 2014 నుంచి743 రైల్వే ఫ్లై ఓవర్లు, అండర్ బ్రిడ్జిలను నిర్మించామని తెలిపారు ఈ ఏడాది 73 స్టేషన్లను ‘అమృత్ స్టేషన్లు’గా అభివృద్ధి చేస్తున్నామని, అందులో విజయవాడ రైల్వేస్టేషన్ ఒకటి అని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
కాగా, విశాఖ రైల్వేజోన్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఇంతవరకూ భూమిని అప్పగించలేదని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గత ప్రభుత్వం ఇవ్వజూపిన స్థలం రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో ఉన్నందువల్ల బ్యాక్ వాటర్ సమస్యతో దాన్ని స్వీకరించలేదని, తర్వాత ఎన్నిసార్లు అభ్యర్థించినా తమకు భూమి కేటాయించలేదని చెప్పారు. కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల ఆ స్థలాన్ని సందర్శించారని, తనతో కూడా మాట్లాడారని తెలిపారు. త్వరలో భూమిని గుర్తించాలని సీఎం చంద్రబాబును కోరామని, భూమి కేటాయించగానే పనులు చేపడతామని చెప్పారు.
Also Read : PM Narendra Modi : మహారాష్ట్ర ఎన్డీయే ఎంపీలతో భేటీ అయిన ప్రధాని మోదీ