Raj Kasireddy: మద్యం కుంభకోణం కేసులో బిగ్ ట్విస్ట్

మద్యం కుంభకోణం కేసులో బిగ్ ట్విస్ట్

 

ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసులో ఆశక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుపై ఏసీబీ కోర్టులో వాదనలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తొలుత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కోర్టులో హాజరుపరుచగా… ప్రభుత్వం తరపున కళ్యాణి… కసిరెడ్డి తరపున పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు. మద్యం పాలసీ పేరుతో అవినీతికి పాల్పడ్డారని… ఉద్దేశపూర్వకంగా ప్రజా ధనాన్ని దోచుకున్నారని ప్రభుత్వం తరపున కళ్యాణి వాదించారు. నెలకు రూ. 60 కోట్లు కసిరెడ్టి ద్వారా డబ్బులు చేతులు మారాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను సైతం రాజ్ డిక్టేట్ చేశారన్నారు. అవినీతి, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని పీపీ కళ్యాణి వాదనలు వినిపించారు.

 

అయితే, ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌ లో కసిరెడ్డి రాజ్ పేరు లేదు కదా అని కోర్టు ప్రశ్నించింది. కసిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగి కానప్పటికీ… ఏసీబీ కోర్టులో ఈ కేసును ఎందుకు వేశారని న్యాయాధికారి ప్రశ్నించారు. 17a ఈ కేసులో ఎలా వర్తిందో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. సీఐడి కేసు కూడా ఉన్నందున సీఐడీ కోర్టులో ఈ కేసు వేసుకోవాలని న్యాయస్థానం సూచించింది.

మరోవైపు రాజ్ కసిరెడ్డి తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. రాజ్ కసిరెడ్డి… వైసీపీ ప్రభుత్వానికి ఐటీ సలహాదారుడుగా ఉన్నారని… ఆయనకు నేరుగా ప్రభుత్వ కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని వాదించారు. ఈ కేసు అసలు ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదన్నారు. రాజకీయ కారణాలతోనే కసిరెడ్డిపై కేసు పెట్టారన్నారు. పిసి యాక్ట్ ఈ కేసులో అసలు అమలు కాదని పొన్నవోలు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి… ఈ కేసు ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదని అభిప్రాయపడ్డారు. మెమో వెనక్కి ఇస్తామని… సిఐడి కోర్టులో హాజరు పరచాలని న్యాయాధికారి సూచించారు. ఇందుకు సమయం కావాలని ప్రాసిక్యూషన్ కోరడంతో… వాదనలకు తాత్కాలిక బ్రేక్ పడింది.

మద్యం కుంభకోణంపై విజయ సాయిరెడ్డి సంచలన ట్వీట్

ఏపీ మద్యం కుంభకోణంలో తన పాత్ర విజిల్‌ బ్లోయర్‌లాంటిదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు తన అఫీషియల్ సోషల్ మీడియా ‘ఎక్స్‌’లో ఆయన పోస్ట్‌ చేశారు. ‘‘తప్పించుకునేందుకే దొరికిన దొంగలు… దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయీ నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల దుస్తులు సగమే విప్పారు. వారి మిగతా దుస్తులు విప్పేందుకు పూర్తిగా సహకరిస్తాను’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో పాత్రధారి, సూత్రధారి కెసిరెడ్డి రాజ్ అని ఇటీవల విజయసాయిరెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘‘మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్‌ కెసిరెడ్డే. దీనికి సంబంధించి చెప్పాల్సి వస్తే మరిన్ని వివరాలు భవిష్యత్తులో వెల్లడిస్తా’’ అని అప్పట్లో ఆయన చెప్పారు. అయితే విజయసాయి రెడ్డి ఒక బట్టేబాజ్ మనిషి అని… అతని చరిత్ర అంతా త్వరలో మీడియా ముందు పెడతా అంటూ రాజ్ కసిరెడ్డి ఓ ఆడియోను రిలీజ్ చేసారు. ఇదే కేసులో సోమవారం కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేసారు. ఈ నేపథ్యంలోనే విజయ సాయిరెడ్డి ‘ఎక్స్‌’లో చేసిన పోస్ట్‌… ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Leave A Reply

Your Email Id will not be published!